అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలోని సీతంపాలెం బీచ్ లో గల్లంతైన వారిలో మరో రెండు మృతదేహాలు రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి. మొత్తం ఏడుగురు విద్యార్ధులు అలల తాకిడికి కొట్టుకుపోగా వారిలో సూరిశెట్టి తేజ అనే విద్యార్ధిని మత్స్యకారులు కాపాడగలిగారు. నిన్న సాయంత్రమే జగదీశ్ అనే విద్యార్ధి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. నేటి ఉదయం పి. గణేష్, గుడివాడ పవన్ కుమార్ మృత దేహాలు బైటపడ్డాయి. చందు, జస్వంత్, సతీష్ ల ఆచూకీ ఇంకా లభ్యంకావాల్సి ఉంది.
నిన్న ఈ విషయం తెలిసిన వెంటనే సిఎం జగన్ స్పందించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను సంఘటనా స్థలానికి వెళ్ళాలని ఆదేశించారు. అమర్నాథ్ బీచ్ కు చేరుకొని విద్యార్ధుల గాలింపు కోసం అధికారుతో మాట్లాడారు. గజ ఈతగాళ్ళు, మత్స్యకారులు, రెండు నేవీ, రెండు కోస్ట్ గార్డ్ బృందాలను రంగంలోకి దించాయి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ సుభాష్ పఠాన్ చెటి, ఎస్పీ గౌతమి శాలి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. కాగా అనకాపల్లి జాయింట్ కలెక్టర్ కల్పన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు.