Tuesday, November 26, 2024
HomeTrending Newsధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న

ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న

ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. పేదల పాలిట ఆపద్బాంధవుడు… సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు. రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్‌ సర్వాయి పాపన్న. నేడు ఆయన 370వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడి యాదిలో..!

గోల్కొండ ఖిల్లాపై విజయ పతాకాన్ని ఎగురేయడమే లక్ష్యంగా తుదివరకు పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌. జన హృదయంలో అతనొక సర్దార్‌. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్‌ మీరు సాహెబ్‌…వీరంతా ఆయన ప్రధాన అనుచరులు. పన్నెండు మందితో మొదలైన ఆ పోరాటం, పన్నెండు వేల మంది సైన్యంగా అవతరించింది. అదంతా పాపన్న నాయకత్వంలో రూపొందిన సైన్యమే. ‘‘అమ్మా! తాటిచెట్టు ఎక్కను. లొట్టి పట్టను. గోల్కొండ పాలనా పగ్గాలు పట్టడమే నా జీవిత ఆశయం’’ అని తన తల్లి సర్వమ్మకు పాపన్న మాటిచ్చినట్లు చారిత్రక అధ్యయనకారుల రచనల ద్వారా వెల్లడవుతుంది. ‘‘గోల్కొండ కోటను ఏడు గడియలు పాలించాడు సర్వాయి పాపన్న’’ అని జానపద కళాకారులు పాడుకునే శారద కథల్లో ఉందని పరిశోధకుడు కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ చెబుతున్నారు.

కేంబ్రిడ్జి వర్సిటీ ప్రచురణలో…

ఔరంగజేబు ఆస్థాన చరిత్ర రచయిత ఖాఫీ ఖాన్‌. తమ రాజు జయవిజయాలను, వీరపరాక్రమలను నమోదు చేయడం ఆయన విధి. అయితే, ఔరంగజేబు మాత్రం తన దండయాత్రలు, యుద్ధాలు, రాజ్యాక్రమణల వివరాలను నమోదు చేయద్దని ఖాఫీఖాన్‌కు ఆదేశించాడు. కానీ ఖాన్‌ మాత్రం హస్తినను వదిలి, గోల్కొండ రాజ్యానికి వలసవచ్చి రహస్య జీవనం సాగించాడు. అదే సమయంలో ఔరంగజేబు గురించిన వివరాలను ‘‘ముంతకాబ్‌ ఉల్‌ లుబాబ్‌’’ పేరుతో పుస్తకాన్ని రచించాడు. ‘‘ఆ పుస్తకం ఆధారంగా యూరోపియన్‌ చరిత్రకారుడు రిచర్డ్‌ ఎం ఈటెన్‌ ‘‘ఏ సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ది దక్కన్‌1-1300-1761’’ పేరుతో పుస్తకాన్ని రాశాడు. అది కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించడం విశేషం. అంతేకాదు, సామాన్య కుటుంబంలో పుట్టి, సామ్రాజ్యాధినేతలపై గెరిల్లా పోరాటం చేసిన అసామాన్య వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న చిత్రపటాన్ని ఆ పుస్తక ముఖచిత్రంగా ముద్రించడం విశేషం’’ అని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ఆచార్యుడు జి. అంజయ్య వివరిస్తున్నారు. సర్వాయి పాపన్నపై మరింత లోతైన పరిశోధన జరగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

#దూల్మిట్టలో తొలి శాసనం..#

కుతుబ్‌షాహీ రాజ్యాన్ని ఓడించిన ఔరంగజేబు 1687లో గోల్కొండ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అదే సమయంలో ప్రాంతాల వారీగా జాగిర్దారు, సుబేదారుల పదవుల్లో తన మనుషులను నియమించి, వాళ్లకు పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు మొగల్‌ చక్రవర్తి. జాగిర్దార్లు, పాలనాధికారుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా సాగాయి. పేద, సామాన్య ప్రజల నుంచి విపరీతంగా పన్ను వసూలు చేయడం పెచ్చుమీరింది. అధికారంలో ఉన్నవాళ్ల ఆగడాలు పెరిగాయి. పేదల కష్టాలు, కడగండ్లను చూసి చలించిన సర్వాయి పాపన్న పెత్తందారీలపై ధిక్కార బావుటా ఎగురవేశాడు. సైన్యాన్ని కూడగట్టి గెరిల్లా పోరాటం ద్వారా తన స్వస్థలం ఖిలాషాపూర్‌ రాజధానిగా పాలన సాగించాడు. భువనగిరి కోటను వశం చేసుకొని సుమారు రెండు దశాబ్దాల పాటు ఏలాడు. లొట్టిపట్టే చేతితో ఆయుధం ధరించి రాచరికంలో సామ్యవాద సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలీకుడు కూడా. రాజవంశీకులే రాజ్యాధికారం చేపడతారనే నానుడిని చెరిపేసి, చరిత్రలో మహావీరుడిగా చిరస్మరణీయుడిగా మిగిలాడు. సిద్దిపేట వద్దనున్న దూల్మిట్ట గ్రామంలోని నాచగోని రాజయ్యగౌడ్‌ పొలంలో పాపన్న విగ్రహాన్ని పోలిన శిలాశాసనం దొరికింది. ‘‘ప్రఖ్యాత చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి ఆ శాసనాన్ని పరిష్కరించారు. పాపన్న వీరత్వాన్ని, శౌర్యాన్ని వర్ణిస్తూ ఆ శాసనంలో ఉంది’’ అని వెంకట్‌ గౌడ్‌ చెబుతున్నారు. ఆ వివరాలతో పాటు పాపన్న ఏలిన కోటల గురించిన చారిత్రక వివరాలను తాను పుస్తకంగా తీసుకొచ్చారు.

మొగలాయిలకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న 1709లో కన్నుమూశారు. ఆయన మరణంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శత్రువుల చేతిలో కన్నుమూయడాన్ని అవమానంగా భావించిన పాపన్న తన బాకుతో తానే శిరచ్ఛేదనం చేసుకున్నాడని ప్రచారంలో ఉంది. దక్కన్‌ రాజ్యంపై ఢిల్లీ పెత్తనాన్ని ధిక్కరించి గోల్కొండ ఖిల్లాపై స్వతంత్య్ర బావుటా ఎగరేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం. సమకాలీన రాజకీయాలకూ ఆయన ధిక్కార బాట ఆదర్శనీయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్