టాలీవుడ్ లో కొంతకాలం క్రితం వరకూ బాలీవుడ్ విలన్స్ జోరు నడిచింది. ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ తీవ్రత చాలా వరకూ తగ్గింది. ఆయన తరువాత సౌత్ కి చెందిన ఏ విలన్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో జగపతిబాబు .. శ్రీకాంత్ వంటి హీరోలు విలన్స్ గా మారిపోయారు. ఇక కన్నడ నుంచి అడపా దడపా ఉపేంద్ర .. సుదీప్ లాంటివారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ వచ్చిన అర్జున్ దాస్, పవర్ఫుల్ విలన్ గా తెరపైకి వచ్చాడు.
అర్జున్ దాస్ అరడుగుల ఆజానుబాహుడు కాదు .. కండలు తిరిగిన పర్సనాలిటీ లేదు. ఆయన కళ్లు .. వాయిస్ ఆయన విలనిజానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. కఠినత్వంతో కూడిన ఆయన చూపులు .. కరకుదనంతో కూడిన వాయిస్ తో విలన్ గా ఫుల్ బిజీ అయ్యాడు. కార్తి ‘ఖైదీ’ .. విజయ్ ‘మాస్టర్’ సినిమాల్లో ఆయన విలనిజాన్ని ప్రేక్షకులు మరిచిపోలేదు. సహజత్వానికి చాలా దగ్గర నటించడం .. తనదైన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి.
అలాంటి అర్జున్ దాస్ తాజా చిత్రంగా ‘బుట్టబొమ్మ’ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఆ ప్రేమికులకు అడ్డుపడే ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. విలన్ గా ఆయనను ఎంపిక చేసుకున్నప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ అయినట్టు అని మొన్న స్టేజ్ పై మారుతి అనడం గమనించదగిన విషయం. ఈ సినిమా తరువాత టాలీవుడ్లో అర్జున్ దాస్ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.