గుణశేఖర్ నుంచి ‘రుద్రమదేవి’ తరువాత ఇంతవరకూ మరో సినిమా రాలేదు. చారిత్రక .. పౌరాణిక కథలపై మంచి పట్టున్న గుణశేఖర్, అదే రూట్లో ముందుకు వెళ్లాలనే ఆలోచనతోనే కనిపిస్తున్నారు. ఆయన నుంచి రానున్న ‘శాకుంతలం’ సినిమా కోసం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక అందమైన కావ్యంగా ఆయన ఈ సినిమాను తీర్చిదిద్దారు. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయమవుతున్నాడు.
దుష్యంతుడి పాత్రకు ఇక్కడి హీరోలను తీసుకోకపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ” ఈ సినిమా టైటిల్ ‘శాకుంతలం’ .. లేడీ ఓరియెంటెడ్ సినిమా .. ఇలాంటి ఒక సినిమాలో దుష్యంతుడి పాత్రను చేయడానికి ఎంతమంది హీరోలు ముందుకు వస్తారనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దుష్యంతుడి పాత్రలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయినా మేము చేస్తామని ఏ హీరో ముందుకు రాలేదు. నేను అడిగినా అందువలన ప్రయోజనం ఉంటుందని అనుకోలేదు” అని చెప్పారు.
“దుష్యంతుడి పాత్ర కోసం టాలీవుడ్ కి కొత్త ఫేస్ అయితేనే బెటర్ అనే నిర్ణయం తీసుకున్నప్పుడు, మలయాళంలో దేవ్ మోహన్ చేసిన ఒక సినిమా చూశాను. ఆయన ఈ పాత్రకి కరెక్టుగా సరిపోతాడని అనిపించింది. దుష్యంతుడు లేని శకుంతల లేదు .. అందువలన దుష్యంతుడి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ తరం ప్రేక్షకులకు ఈ కథ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమాను చేశాము. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.