Monday, November 25, 2024
Homeసినిమాసోనీ లివ్ లో 'బృంద' .. మెప్పించిన త్రిష!

సోనీ లివ్ లో ‘బృంద’ .. మెప్పించిన త్రిష!

‘బృంద’ .. ఓ పోలీస్ ఆఫీసర్. ఎక్కడో అటవీ ప్రాంతానికి దగ్గరలో .. ఒక మారుమూల  గిరిజనగూడెంలో ఆమె పుడుతుంది. ఐదేళ్ల వయసులోనే అక్కడి మూఢ నమ్మకాలకు ‘బలి’ కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టం బాగుండి ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడుతుంది. అయితే ఆ ప్రయత్నంలో తల్లికీ .. అన్నయకి దూరమవుతుంది. అలా హైదరాబాద్ చేరుకున్న ఆ పాపకి ఓ పోలీస్ ఆఫీసర్ ఆశ్రయమిస్తాడు. ఆమెను పోలీస్ ఆఫీసర్ గా తయారు చేస్తాడు.

అలా ‘బృంద’ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ స్థాయికి ఎదుగుతుంది. అయితే ఇక్కడి నుంచే ఆమెకి సవాళ్లు ఎదురుకావడం మొదలవుతుంది. సిటీ చుట్టుపక్కల చిత్రమైన పద్ధతిలో హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకులను పట్టుకోమని అంటూ పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆమె ఇన్వెస్టిగేషన్ లో ఇద్దరు అనుమానితులుగా తేలతారు. ఆ ఇద్దరూ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? వాళ్ల గురించిన ఇన్వెస్టిగేషన్ లో బృందకు ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివి? అనేదే కథ.

దర్శకుడు సూర్య మనోజ్ వంగల ఈ కథను చెప్పడానికి 8 ఎపిసోడ్స్ సమయం తీసుకున్నాడు. మొదటి 6 ఎపిసోడ్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా కథను చాలా ఆసక్తికరంగా ఆవిష్కరిస్తూ వచ్చాడు. 7 ఎపిసోడ్ .. 8 ఎపిసోడ్ లో కొంతభాగం కాస్త గ్రాఫ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే జరగవలసిందంతా జరిగిపోయిన తరువాత, ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి దర్శకుడు పయత్నించడమే అందుకు కారణమని అనుకోవాలి. మొత్తానికి క్లైమాక్స్ కి చేరుకునే సమయానికి కథ సర్దుకుంటుంది.

త్రిష చాలా నాజూకుగా కనిపిస్తూనే .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. ఆమె ఈ సిరీస్ ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పుకోవాలి. ఆమె పాత్రను మలిచిన విధానం బాగుంది. ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించిన ఇంద్రజిత్ సుకుమారన్ .. రవీంద్ర విజయ్ .. ఆనంద్ సామి తమ పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు. మొత్తంగా చూసుకుంటే, ఈ సిరీస్  ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్