Sunday, January 19, 2025
HomeTrending Newsపతనం అంచులో మహా వికాస్ అఘాడీ కూటమి

పతనం అంచులో మహా వికాస్ అఘాడీ కూటమి

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 24 గంటల్లో వారంతా ముంబైకి తిరిగి వస్తే..మహా వికాస్‌ అఘాడీ కూటమి నుంచి బయటకు వచ్చే అంశాన్ని పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ ప్రకటనతో మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీలు షాక్ కు లోనయ్యాయి.  ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. తాజా పరిణామాల్లో తమ పార్టీలకు నష్టం వాటిల్లకుండా రెండు పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

మరోవైపు అస్సాంలోని గౌహతిలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో శిబిరం కొనసాగుతోంది. శిబిరంలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు శివసేన ఎమ్మెల్యేలతోపాటు ఇతర స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. ఇటు సీఎం ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశంలో 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం శివసేనకు 55 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ఇందులో కేవలం 13 మంది మాత్రమే ఠాక్రే వెంట ఉన్నారు. దీంతో ఆ పార్టీలో  చీలిక ఖాయంగా కనిపిస్తోంది. ఈతరుణంలో సంజయ్ రౌత్ కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలంతా ఎంవీఏ కూటమి నుంచి శివసేన బయటకు రావాలని కోరుకుంటే ..ముంబైకి వచ్చేయండి..24 గంటల్లో రండి మాట్లాడుకుందాం అని పిలుపునిచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

మరోవైపు రాజకీయ అనిశ్చితిని క్యాచ్ చేసుకోవాలని బీజేపీ స్కెచ్‌లు వేస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. అస్సాంలోని గౌహతి నుంచే ఇందుకు నాంది పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే శిబిరానికి అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కలిసి వస్తే..వారికి భారీగా పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శివసేన రెబల్స్‌ ఎమ్మెల్యేలకు 8 మందికి మంత్రి పదవులు, ఐదుగురికి సహాయక మంత్రులు ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివసేన ఎంపీలు వచ్చినా..వారికి సైతం మంచి పదవులు ఇచ్చేందుకు బిజెపి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే ఉద్దేశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

Also Read : శివసేనలో అసమ్మతి సంక్షోభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్