Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవాడుకమాటల్లో అడుగడునా చావే

వాడుకమాటల్లో అడుగడునా చావే

Deadly Language:
“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి”

పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు.

భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఫేమస్. చావు పందిట్లో సౌండ్ బాక్స్ లో ఘంటసాల పాడిన భగవద్గీతను మొదట ఎవరు వాడారోకానీ, ఆ క్షణం నుండి భగవద్గీత ఆత్మలకు, అంతరాత్మలకు, దశదిన కర్మలకు, శవ యాత్రలకు, సంతాప సభకు, సామూహిక శోక సభలకు మాత్రమే పరిమితమైపోయింది. అర్జున విషాదయోగం అని ఒక అధ్యాయానికి పేరు ఉండడంతో భగవద్గీత విషాదానికి సంకేతంగా మరికొందరు భావించారు. నిజానికి మొత్తం భగవద్గీత కర్తవ్య బోధ. పనులు చేయకుండా తప్పించుకునే పలాయనవాదులకు కర్రుకాల్చి భగవంతుడు పెట్టిన వాత. ఎనభై ఏళ్లు దాటి కాటికి కాళ్లు చాచినవారికి తప్ప మిగతావారికి భగవద్గీత అంటరానిది కావడానికి రకరకాల కారణాలు. ఆ చర్చకు ఇది వేదిక కాదు.

అనాయాసేన మరణం;
వినా దైన్యేన జీవనం – అని సుఖమయిన చావు కోసం , ఒకరు జాలిపడేలా జీవితం ఉండకుండా ఉండడం కోసమే గుడికి వెళ్లినప్పుడు భగవంతుడిని ప్రార్థించాలని ఒక ప్రమాణం . ఇలా అడగడానికి మొదట ధైర్యం కావాలి ; తరువాత అమాయకత్వమో, అజ్ఞానమో ఉండాలి.

చావంటే భయం నటిస్తాం కానీ…నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం. కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది. నిజానికి చచ్చేప్పుడు ఎవరూ పని పెట్టుకోరు – చచ్చే పని తప్ప. ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా చచ్చే చావొస్తుంది. పసిపిల్లలు అల్లరి చేస్తుంటే చంపేస్తున్నార్రా అనకపోతే బతుకు సాగదు . చచ్చేట్టు తిడితేనే తిట్టినట్లు. కొందరు పెళ్ళిలో, చావులో మాత్రమే కలుస్తూ ఉంటారు. శుభమా అని సుబ్బి పెళ్లి పీటలు ఎక్కితే ఆమె చావుకే వస్తుంది. కొడితే చచ్చేట్టు కొట్టాలి. చావు కబురు ఎప్పుడూ చల్లగానే చెప్పాలి.

పెళ్ళికి చావుకు ఒకే మంత్రం ఎక్కడ చెబుతారోనని ఆందోళన. రాచపీనుగ ఒంటరిగా వెళ్లలేక తోడుకోరుకున్నా మనం అర్థం చేసుకోగలం. కోపమొస్తే చచ్చినా ఇక పగవాడి మొహం చూడం. పైగా వారికే చచ్చినా నీ గడప తొక్కను అని బతికి ఉన్న గర్వంతో చెప్పగలం. చాలామంది మనల్ను రోజూ చంపుకు తింటున్నా ఎలాగో మళ్లీ మళ్లీ బతుకుతూ ఉంటాం. బాగా కోపమొస్తే బతికి ఉన్న వారిని ఒరేయ్ పీనుగా! అంటూ చంపేస్తాం. ఒట్టి పీనుగకు విలువ లేదనుకుంటే చవట పీనుగ, ముదనష్టపు పీనుగ అని విశేషణాలు జతచేస్తాం. జాగారంలో శవజాగారం ఒకటి. పీనుగ ఎదురొస్తే అదృష్టమే అదృష్టమట.

ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ చావు పాండిత్యం ఎందుకు?
ప్రాణం ఉంటే శివం – ప్రాణం లేకుంటే శవం.
మృతియె లేకున్న రుచి ఏది ఇలలోన? అన్నాడు దాశరథి .
స్వతంత్ర దేశంలో చావును పెళ్లిగా మలిచారు సినీ కవులు.

మరణాంతాని వైరాని – చచ్చాక పగలు ప్రతీకారాలు కూడా చచ్చి పోవాలి అని హితవు చెప్పాడు శ్రీరామచంద్రుడు. సమయం ఆసన్నమయినప్పుడు పండిన దోసకాయ తీగనుండి టక్కుమని తనకు తానుగా విడివడినట్టు బంధాలను తెంచుకుని మృత్యువులోకి వెళ్లాలంటుంది మృత్యుంజయ మంత్రం. చాలామంది చావును జయించడానికే ఈ మంత్రం అనుకుని చచ్చేట్టుగా చదువుతుంటారు. నిజానికి ఇది చావు భయాన్ని జయించే మంత్రం.

యముడు కలలో కూడా నిషిద్ధం. చావులేని జగతిని ఒక్క సారి ఊహించుకోండి. దుర్భరంగా ఉంటుంది. అసలు ఈ లోకం పేరే మర్త్య లోకం . వ్యాకరణం, అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం. మృత్యువును వెంటబెట్టుకుని పుట్టే లోకాన్ని మర్త్య లోకం అంటారు.

Morals And Ethics

అంతములేని ఈ భువనమంతయు – అంటూ ఎంతటివారయినా ఈ భూమి మీద పోవాల్సిందే అన్నాడు దువ్వూరి రామిరెడ్డి . భూమి ఒక బాట. పొద్దున, సాయంత్రం ఈ బాటకు అటు ఇటు తలుపులు. ఆ తలుపులో వచ్చి , ఈ తలుపుగుండా వెళ్లిపోవాల్సిన వాళ్లమే.

మరణానికి భయపడకుండా మరణాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడారు సి నా రె.
మరణం నా చివరి చరణం కాదన్నాడు అలిశెట్టి ప్రభాకర్.

“మృత్యువుకు నేనంటే భయం. నేనున్నప్పుడు అది నాముందుకు రాదు.
అది వచ్చినప్పుడు నేను ఉండనే ఉండను”- అని ఒక ధైర్యవంతుడు కొంటెగా అన్నా మృత్యువుకు లొంగిపోయేవాడినే అని చెప్పకనే చెప్పుకున్నాడు.

వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు ఎన్నయినా ఉండవచ్చు.
కానీ చావు ఎగతాళి కాదు.
చావు- చచ్చేంత సీరియస్.

రాజకీయ భాష దానికదిగా ఒక ప్రత్యేకమయిన భాష. ఏ శబ్ద రత్నాకరాలయినా, ఏ చిన్నయసూరి వ్యాకరణాలయినా రాజకీయ భాష ముందు అర్థం చెప్పలేక, సిగ్గుతో తలదించుకోవాల్సిందే. దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే వరికి ఉరి తాడు బిగుసుకుంది. ఆ ఉరి తాడును పేనింది ఒకరు. వరి మెడకు చుట్టింది మరొకరు. గట్టిగా బిగించింది ఇంకొకరు. అభిలాష సినిమా క్లైమాక్స్ లో ఉరిని తప్పించినట్లు ఇప్పుడు ఆఖరి నిముషంలో ఉరి తాడును ఒడుపుగా విప్పాల్సింది మరొకరు. వరి ఉరిలో ఎవరు దోషులు? ఎవరిది పాపం? ఎవరెవరిది ఉన్మాదం? లాంటి చర్చ ఇక్కడ అనవసరం.

అధికార టి ఆర్ ఎస్, ప్రతిపక్ష బి జె పి ల మధ్య అన్నం మెతుకుల గుండె కుతకుత ఉడుకుతోంది. కళ్లముందు వడ్లలో పొట్టు మాత్రమే కనిపిస్తోంది. వరి పేరిట జరుగుతున్న పోరాటాలతో సంస్కారాలకు అంతిమ సంస్కారం జరుగుతోంది. మర్యాదలకు నూకలు చెల్లుతున్నాయి. హుందాతనం నోట్లో చివరి బియ్యపు గింజలు పడుతున్నాయి.

బి జె పి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని టి ఆర్ ఎస్ పెద్ద మనిషి బతికి ఉండగానే చంపేశారు. బండి పొతే ఆయనక్కూడా రైతు బంధు అయిదు లక్షలిస్తామన్నారు. టి ఆర్ ఎస్ చావు భాషకు…అదే పాడె భాషతో బండి బదులివ్వాల్సి వచ్చింది. నేను పొతే ఆ ఎల్ ఐ సి డబ్బు నీకే! అన్నారు.

రాజకీయ విధానాలమీద వాదోపవాదాలు, గొడవలు దారి తప్పి…ఎటెటో వెళ్లిపోయి…సంస్కారాన్ని పాతిపెట్టి…చివరికి చావును కోరుకుంటున్నాయి.

బతికి బాగుపడే యోగం ఉండగా …చచ్చి సాధించడం ఎందుకు? ఎవరికయినా ఈరోజు చస్తే…రేపటికి ఒకటో రోజు. ఎల్లుండికి రెండో రోజు. అంతే. యద్భావం తద్భవతి.

తెలుగు సాహిత్యం మీద, తెలంగాణ మాండలికం మీద సాధికారమయిన పట్టున్న ముఖ్యమంత్రి కె సి ఆర్ తమ పార్టీ నాయకులకు చావు భాష కాకుండా…బతుకు భాష నేర్పితే ఎంత బాగుంటుందో!

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:  

వార్త వచ్చిందా.. షేర్ చేశామా? అంతే!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్