తెలంగాణ ఉద్యమం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిందని తెరాస అధినేత కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసంతో ముందుకు సాగి విజయం సాధించామని దళిత బంధు ను కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తామని కెసిఆర్ వెల్లడించారు. అంతకు ముందు తెలంగాణలో ఇటీవల చనిపోయిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించగానే పార్టీ శ్రేణులు నినాదాలు, చప్పట్లతో హర్షద్వానాలు వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల ప్రస్తానం తర్వాత కూడా మరోసారి ఎన్నుకున్నందుకు కెసిఆర్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. 2001 లో పార్టీ ఆవిర్భావ సమయంలో నెలకొన్న పరిస్థితుల్ని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు సమైక్యవాదులు సృష్టించిన అడ్డంకుల్ని వివరించారు.
సీఎం ,టీ ఆర్ ఎస్ నేత కే సీ ఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు…
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు అపోహలు. అనుమానాలు. విశ్వాస రాహిత్య పరిస్థితీ ఉండేది. ఎన్నో ఆందోళన పిలుపులు విఫలమయినా గాంధీజీ పోరాటాన్ని ఆపలేదు. జలియన్ వాలా బాగ్ తర్వాత కూడా స్వాతంత్ర్య పోరాటం సాగింది. తెలంగాణ ఉద్యమం కూడా అలాగే సాగింది. రాజ్యసభ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో కూడా సమైక్యవాదులు అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకున్నాం. పాలనలో ఏడేళ్ళ నుంచి ఎనిమిదేళ్లలోకి ప్రవేశించాం. అభివృద్ధికి సామాజిక స్పృహ జోడించడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే తెలంగాణలో సక్సెస్ అయ్యాం. కొందరు తెలంగాణ కారు చీకటి అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని చెప్పిన వారికి మనం పాలనతో సమాధానం చెప్పాం. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మన అభివృద్ధిని చాటుతున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధి లో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుంది. ఏ రంగాల్లో అపోహలు వ్యక్తం అయ్యాయో ఆ రంగాల్లో విజయం సాధించి చూపాము. పంజాబ్ ను తలదన్నే రీతిలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించాం.
తెలంగాణ పథకాలు తమ రాష్ట్రంలో ప్రవేశ పెట్టాలని కర్ణాటక. మహారాష్ట్రలోని ప్రజలు కోరుతున్నారు. నాందేడ్ జిల్లా ఐదు నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ లో కలుస్తామంటున్నరు. రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మెచ్చుకుని తమ రాష్ట్రం లో వాటిని ప్రవేశ పెట్టాలని కోరారు. దళిత బంధు స్ఫూర్తి తో టీ ఆర్ ఎస్ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం ap లో కూడా ప్రారంభించాలని అక్కడ్నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇంతగా తెలంగాణ అభివృద్ధి చెందడం నా ఒక్కడి వల్ల సాధ్య పడ లేదు.ఇందులో అందరి కృషి ఉంది. సర్పంచ్ నుంచి పై వరకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు. ప్రతీప శక్తులు అపుడు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి.అన్నిటిని అధిగమించి ముందుకు పోతున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో అడ్డంకులు సృష్టించారు. వాటిని అధిగమించాం. తెలంగాణలో కులం. మతం అనే ఇరుకైన ఆలోచన మాకు లేదు. దళిత బంధు ఓ సామాజిక స్వా0తన పథకం. ఇది దేశానికి స్ఫూర్తి. రైతు బంధు ప్రారంభించినపుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇపుడు కూడా దళిత బంధు పై అవాకులు చవాకులు పేలుతున్నారు.దళిత బంధు కు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు తెలంగాణ కు ఓ పెద్ద లెక్క కాదు.2028 కల్లా తెలంగాణ బడ్జెట్ నాలుగు లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం తొమ్మిది లక్షల రూపాయలు చేరుతుంది. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు కొందరు సీఎం లు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగారు. దానికి సాహసం కావాలి. ఇతర వర్గాలకు కూడా ఏదైనా చేయాలంటే అది టీ ఆర్ ఎస్ వల్ల మాత్రమే సాధ్యం. కాంగ్రెస్ బీజేపీ లు డిపాజిట్లు కోల్పోయే పార్టీలు.
టీ ఆర్ ఎస్ మాత్రమే తెలంగాణ అంతటా యూనిఫామ్ గా ఉన్న పార్టీ .టీ ఆర్ ఎస్ మాత్రమే తెలంగాణ కు శ్రీరామ రక్ష.ఇదే ధృతి ఉధృతి కొనసాగాలి. మనకు బాస్ లు తెలంగాణ ప్రజలే.. హై కమాండ్ ఎవ్వరూ లేరు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఢిల్లీ కి గులాం లు. ఏ కార్యక్రమం చేపట్టినా వారికి ఢిల్లీ అనుమతి కావాలి. హారాకిరి గాళ్ళు, కిరాయి గాళ్లకు టీ ఆర్ ఎస్ అదిరి పోయే పార్టీ కాదు. బలమైన ఆర్థిక శక్తి గా కూడా టీ ఆర్ ఎస్ ఎదిగింది. 400 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ లు టీ ఆర్ ఎస్ కు ఉన్నాయి. రెండు కోట్ల రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది. టీ ఆర్ ఎస్ తెలంగాణ ప్రజలు చూపిన ప్రేమకు తిరిగి ప్రేమ ను అందించింది. కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ లో వ్యవహరిస్తున్న తీరు సరికాదు. నా సభ పై ఆంక్షలు సరికాదు. సాగర్ లో నా సభ జరగకుండా కోర్టులకు కూడా వెళ్లారు. హుజురాబాద్ వెళ్లకుండా ఆపినా ఇక్కడ్నుంచి చేసిన ప్రసంగాన్ని ఎంతో మంది లైవ్ లో వీక్షిస్తున్నారు.దళిత బంధు పై హుజురాబాద్ ప్రజలకు అనుమానాలు వద్దు. దళితుల అండతో గెల్లు శ్రీనివాస యాదవ్ గెలవబోతున్నారు. నవంబర్ 4 నుంచి ఆయన ఆధ్వర్యంలో దళిత బంధు అమలవుతోంది. దళిత బంధు అమలు ను చూడడానికి 118 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో హుజురాబాద్ వస్తారు. నేను కూడా దళిత బంధు అమలు అయ్యే మిగతా నియోజక వర్గాలకు త్వరలోనే పర్యటిస్తా. మార్చి కల్లా దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో పార్టీ కార్యాలయాన్ని కడుతం. ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని 8 నుంచి పది నెలల్లో పూర్తి చేస్తాం. ఎనిమిది నెలల పాటు టీ ఆర్ ఎస్ శ్రేణుల కు కఠోర శిక్షణ ఇస్తాం. తెలంగాణ కోసమే నా జీవితం పునరంకితం. పార్టీ శ్రేణులు కూడా తెలంగాణ అభివృద్ధి లో అంకిత భావాన్ని క్రమశిక్షణ ను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా.