కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని…ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని సిఎం స్పష్టం చేశారు.
బుధవారం నాడు ప్రగతి భవన్ లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు, సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై సిఎం మాట్లాడుతూ….‘‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేకానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయాసందర్బాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదు. అదీకూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’’ అని సిఎం కెసిఆర్ స్పష్ఠం చేశారు.
చాలా రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు స్టయిఫండ్ ను తెలంగాణ కంటే తక్కువగా ఇస్తున్న విషయాన్ని వైద్యాధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సమస్యలు ఏమిటి అని సిఎం ఆరాతీసారు. అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని సిఎం ఆదేశించారు.
సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సిఎం నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సిఎం నిర్ణయించారు. కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారి కోరికమేరకు సత్వరమే అందించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.