రెవెన్యూ సదస్సులు అంటూ సిఎం కేసిఆర్ సరికొత్త డ్రామాకు తెరతీశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్ వంకతో భూమిపైకి ఎవరన్నా వస్తే తిరగబడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్ మాయలోడని, అయన చెప్పే మాయమాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో జరిగిన ‘ధరణి రచ్చబండ’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేసే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ లో ధరణి మొదలు పెట్టినప్పుడు ఇది అద్భుతం అని, సర్వోరోగ నివారిణి అని కేసీఆర్ చెప్పారని, కానీ పేదలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ ను వివిధ కారణాలతో గుంజుకుంటున్నారని మండిపడ్డారు. తరతరాలుగా వస్తున్న భూమిని కూడా కొన్ని చోట్ల అన్యాయంగా లాక్కుంటున్నారన్నారు.
సర్కారే భూములు లాక్కోవడం సిగ్గు చేటని, రికార్డులో ఎవరెవరి పేర్లో ఉంటున్నాయని, లేదంటే సర్కార్ భూమి అంటూ చూపిస్తోందని, ఇక ధరణి పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటని నిలదీశారు. పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 25లక్షల భూములను పంచిందని గుర్తు చేశారు. 5లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆగం అవుతున్నాయని, ఇప్పటికే 30 లక్షల ఎకరాలు మాయం అయ్యాయని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మీటింగ్ లో చెప్పినట్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి ని రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణాలో భూమే ఆత్మగౌరవమని, కానీ దాన్ని దెబ్బతీసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. పాత రికార్డులన్నీ మాయం చేసి.. రెవెన్యూ వ్యవస్థను ఆగం చేశారని, సచివాలయం కూలగొట్టుడు వెనుక రికార్డుల మాయం చేసే కుట్ర జరిగిందన్నారు.
మరోవైపు ఐటీ కంపెనీ లు ఎవడికి ఉద్యోగాలు ఇస్తున్నాయో తెలియదు కానీ అడ్డగోలుగా భూములు పందేరం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఐకియాకు ఎకరాకు 50కోట్లు పలికే భూమి అడ్డగోలుగా 15 ఎకరాల భూమిని తక్కువ రేటుకే కట్టబట్టారని, ఇప్పుడు ఆ స్థలం గజం 3లక్షల రూపాయలకు అమ్ముడు పోతుందని చెప్పారు. ఈ భూమిని కనీసం టెండర్ కూడా పిలవకుండా ఇచ్చేశారన్నారు. సిటీలో పాన్ డబ్బా పెట్టడానికి జాగా లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు జాగా లేదని కేటీఆర్ అంటున్నాడని, ఐకియాకు ఇచ్చిన భూమిలో కట్టొచ్చుగా అని ప్రశ్నిచారు. చింతమడకలో మీ అయ్యా సంపాదించిన భూమి ఇవ్వాలంటూ కేటిఆర్ ను ఎద్దేవా ఎద్దేవా చేశారు. తెలంగాణ భూ పోరాటాలకు కేరాఫ్ అడ్రెస్ అని, చాకలి ఐలమ్మ భూ పోరాటం తెలంగాణ ఉద్యమానికి దారితీసిందని రేవంత్ గుర్తు చేశారు.
Also Read : వారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి