Sunday, January 19, 2025
HomeTrending Newsటీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు - మంత్రి కేటీఆర్

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు – మంత్రి కేటీఆర్

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TSPSC ) ప‌టిష్టంగానే ఉంద‌ని, కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ల్లే పేప‌ర్ లీకేజీ జ‌రిగింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగ యువ‌త ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంతా మ‌ళ్లీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కావొచ్చ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయమే ప్రగతి భవన్‌కు వచ్చిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ అధికారి నర్సింగ రావు తదితర అధికారులు సిఎం కెసిఆర్ తో సమావేశం ఆయ్యారు. పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చించారు.

తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్‌కే భ‌వ‌న్‌లో కేటీఆర్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప‌బ్లిక్ క‌మిష‌న్ ఏర్ప‌డిన త‌ర్వాత మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 37 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎగ్జామ్‌పై కూడా ఆరోప‌ణ‌లు రాలేదు. కంప్యూట‌ర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 99 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారు. పార‌ద‌ర్శ‌క‌త తీసుకురావాల‌ని అనేక చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింది. యూపీఎస్సీ చైర్మ‌న్ రెండుసార్లు తెలంగాణ‌కు వ‌చ్చి టీఎస్‌పీఎస్సీని విజ‌ట్ చేసి అధ్య‌య‌నం చేశారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇద్ద‌రు వ్య‌క్తులు చేసిన త‌ప్పు వ‌ల్ల మొత్తం వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు వ‌చ్చింద‌న్నారు. ఇది జ‌ర‌గ‌కూడ‌ని ప‌ని. నివారించాల్సిందే. రాష్ట్ర యువ‌తలో భ‌రోసా నింపాల్సిన బాధ్య‌త మా మీద ఉంది.. క‌చ్చితంగా ప్ర‌వీణ్, రాజ‌శేఖ‌ర్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులే కాదు.. వీళ్ల వెన‌కాల ఎవ‌రున్న త‌ప్ప‌కుండా వారిని క‌ఠినంగా శిక్షిస్తాం. ఈ విష‌యంలో ఎలాంటి రెండో అభిప్రాయం పెట్టుకోవ‌ద్దు. ఇది వ్య‌వ‌స్థ త‌ప్పు కాదు.. ఇది కేవ‌లం ఇద్ద‌రి త‌ప్పు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల‌ ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌లుగుతుంది. మేం కూడా బాధ‌ప‌డుతున్నాం. నీళ్లు, నిదులు, నియామ‌కాలు అనే పునాది మీద‌నే తెలంగాణ ఉద్య‌మం న‌డించింది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సీఎం కేసీఆర్ భార‌త‌దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని గొప్ప‌ప‌ని చేశారు.. స్థానికుల‌కు 95 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాం. 2 ల‌క్ష‌ల 30 వేల ఉద్యోగాల భ‌ర్తీకి శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌భుత్వం.. పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుతుంది. సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొస్తాం అని కేటీఆర్ తెలిపారు.

అభ్య‌ర్థులు ఎవ‌రూ మ‌ళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఈ నాలుగు ప‌రీక్ష‌లు గ‌తంలో రాసిన వారు మ‌ళ్లీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. వీలైనంత త్వ‌ర‌గా ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తాం. ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో.. గ్రూప్-1, టీపీబీవో, డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటిరీయ‌ల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను బ‌లోపేతం చేస్తాం. జిల్లాల్లో రీడింగ్ రూమ్స్ 24 గంట‌లు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయ‌ల్‌తో పాటు ఉచిత భోజ‌న వ‌స‌తి కూడా క‌ల్పిస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Also Read : తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష రద్దు…జూన్‌ 11న మళ్ళీ ప్రిలిమ్స్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్