శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు నుంచి మే 31, 2023 వరకూ 861కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవాణి విరాళాల్లో అవినీతి జరుగుతోందని, రసీదులు ఇవ్వడం లేదని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు.
2018లోనే ఈ ట్రస్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలు పెట్టామని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టిటిడి ఆలయాల నిర్మాణానికి, ఆలయాల పునః నిర్మాణానికి, టిటిడి నిర్వహించే రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులకు నెలకు 5వేల రూపాయల గౌరవ భ్రుతికి ఈ నిధులు వినియోగిస్తున్నామని తెలిపారు.
విరాళాలను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నామని, ఇప్పటివరకూ బ్యాంకుల్లో 603 కోట్లు డిపాజిట్ చేశామని, వీటిపై 36 కోట్ల రూపాయల వడ్డీ వచ్చిందని, ఆలయాల నిర్మాణానికి 120కోట్లు ఖర్చు పెట్టామని, ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాల్లో 139 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని వివరాలు బైటపెట్టారు. తాము ఇచ్చిన వివరాలపై ఏవైనా సందేహాలుంటే సంప్రదించవచ్చని సూచించారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తిరుమల కొండపై దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ఈ ట్రస్ట్ ను మొదలు పెట్టమని, 70 మంది దళారులను అరెస్టు చేశామని, మొత్తం 214 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
కాగా, గత రాత్రి తిరుమల కాలిబాట మార్గంలో చిరుత దాడిలో గాయపడ్డ చిన్నారి కౌశిక్ ను సుబ్బారెడ్డి పరామర్శించారు. శ్రీవారి దయ వల్లే బాలుడు ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడని, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారని, సుబ్బారెడ్డి తెలియజేశారు. బాలుడు పూర్తిగా కోలుకున్నాక శ్రీవారి దర్శనం కల్పిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.