టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగరబత్తీల విక్రయ కేంద్రాన్నిటీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో వినియోగించిన పూలు భక్తులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వాటితో అగరుబత్తీలు తయారు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల ఏడు కొండలకు గుర్తుగా ఈ బట్టీలకు ఏడు బ్రాండ్ల పేర్లు పెట్టామని తెలియజేశారు. . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టిటిడి ఈవో జవహర్ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల ఆలయం తప్ప మిగిలిన టిటిడి అనుబంధ ఆలయాల్లో వాడిన పూలతో ఈ అగరబత్తీలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. పూలు వ్యర్ధం కాకూదదన్నదే తమ అభిమతమన్నారు. దర్శన్ సంస్థ భక్తులకు వీటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందిస్తోందని అభినందించారు. తిరుపతి, తిరుమలలో వీటిని భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.
రోజుకు మూడున్నర లక్షల అగరు బత్తీలు తయారు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ పూలతోనే స్వామివారి చిత్ర పటాలు, డాలర్లు, కీ-చైన్లు కూడా తయారీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీనికోసం వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. “సప్తగిరి మాసపత్రికను అధునాతన డిజైన్ తో మళ్ళీ అందుబాటులోకి తెస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను విక్రయిస్తోంది. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ అగరుబత్తీల విక్రయం కోసం టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఎస్వీ గోశాలలో అగర్‌బత్తీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.