Tuesday, September 17, 2024
HomeTrending NewsG20: ఇండియా యూరోప్ కారిడార్... భారత్ కు పాక్ పౌరుల ప్రశంసలు

G20: ఇండియా యూరోప్ కారిడార్… భారత్ కు పాక్ పౌరుల ప్రశంసలు

జీ20 సమావేశాలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ పెంచాయనటంలో ఎలాంటి సందేహం లేదు. 20 ఏళ్ల క్రితం అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ ప్రస్తావన వస్తే అభివృద్ధి చెందుతున్న దేశం…అని చెప్పుకునే వారు. 2023 వచ్చేసరికి ప్రపంచంలో భారతీయులు లేని దేశం అంటూ లేదు. భారత్ గురించి తెలియని దేశం లేదు.

జమ్ముకాశ్మీర్ లో 370 అధికరణం రద్దు చేసిన తర్వాత ముస్లిం దేశాలు భారత్ పట్ల నిరసన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ చేసే తప్పుడు ప్రచారానికి మధ్య ప్రాచ్య దేశాలు మద్దతుగా నిలిచాయి. కాల క్రమేణా గల్ఫ్ దేశాలు భారత్ వాదన సమర్ధించాయి. దీనికి తోడు పాక్ లో మారిన రాజకీయ పరిణామాలు భారత్ కు కలిసి వచ్చాయి.

అయితే టర్కీ మాత్రం ఎక్కడ అవకాశం చిక్కినా భారత్ మీద దుమ్మెత్తి పోయటమే పనిగా పట్టుకుంది. OIC (organization of islamic cooperation) వేదికపై భారత్ ను విమర్శించటమే పనిగా పెట్టుకుంది. ఈ ఏడాది మార్చ్ లో మారిటానియా దేశంలో జరిగిన ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో తుర్కియే…భారత్ ను టార్గెట్ చేసింది. టర్కీలో భూకంపం తర్వాత భారత్ అందించిన మానవతా సాయంతో.. ఆ దేశ ప్రజల్లో భారత్ పట్ల గౌరవం పెరిగింది. క్రమంగా ఆ దేశ అధ్యక్షుడు తయాప్ ఏర్దోగాన్  వైఖరిలో మార్పు వచ్చింది.

ఢిల్లీ జీ 20 సమావేశాల్లో భారత్ విధానాలని అభినందించిన ఏర్దోగాన్…ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో భారత్ కు శాశ్వత సభ్య దేశంగా అవకాశం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పారు. శాశ్వత సభ్య దేశానికి అవసరమైన అన్ని అర్హతలు భారత్ కు ఉన్నాయని స్పష్టం చేశారు.

మరోవైపు పాకిస్థాన్ కు ఎల్లవేళలా అండగా ఉండే సౌదీఅరేబియా… పాక్ దేశానికి ఎప్పుడు కష్టం వచ్చినా ఆర్థికంగా ఆదుకునేది. ఇటీవల షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూడా ఆదుకుంది. భారత్ విషయంలో సౌదీఅరేబియా పాలకులు మొదటి నుంచి జాగ్రత్తగా వ్యవహరించారు. కాశ్మీర్ అంశంలో భారత్ ను ఇబ్బంది పెట్టె చర్యలు చేపట్టలేదు. అది వారి అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేశారు. తాజాగా జీ 20 సమావేశాల సందర్భంగా జరిగిన చర్చల్లో సౌదీఅరేబియా… భారత్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. 54 ఎంఓయు ల ద్వారా వంద బిలియన్ డాలర్ల పెట్టుబెడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల కరెన్సీ ద్వారానే వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు అంగీకారం కుదరటం భారత్ విజయంగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టుకు ప్రతిగా ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరోప్‌ వాణిజ్య కారిడార్‌(India-Middle East-Europe Economic Corridor (IMEC) సౌదీఅరేబియా నుంచి వెళ్ళటం…దానికి ఆ దేశం హర్షం వ్యక్తం చేయటం గొప్ప పరిణామం. ఇది ఆచరణలోకి వస్తే భారత్.. యూరోప్, అరబ్ దేశాలతో వాణిజ్యం సులువు అవుతుంది.

ఈ కారిడార్ ఆచరణలోకి వస్తే చైనా,పాకిస్థాన్ దేశాల సిపెక్ నడావా తేలిపోతుంది. ఇండో యూరోప్ కారిడార్ పై పాకిస్థాన్ పౌరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఈ కారిడార్ లో చేరాలని హితవు పలుకుతున్నారు. చైనాతో లాభం కన్నా నష్టం ఎక్కువగా జరిగిందని వాపోతున్నారు. భారత్ తో సత్సంబంధాల ద్వారా పాక్ ఆర్ధిక చిక్కుల నుంచి బయట పడవచ్చని అభిప్రాయ పడుతున్నారు.

ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సోషల్ మీడియా లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోలిస్తే భారత కాశ్మీర్ లోనే అభివృద్ధి జరిగిందని, నిత్యావసరాలు తక్కువకే లభిస్తున్నాయని పాక్ పౌరులు బహిరంగంగానే అంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం… విదేశాంగ మంత్రి జై శంకర్ దౌత్య నీతి… అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ ఇనుమడింప చేసింది అనటంలో సందేహం లేదు. కాంగ్రెస్ హయంతో పోలిస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్ అభిప్రాయాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సూటిగా వ్యక్తీకరిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్