Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేయటంతో దేశంలో రాజకీయంగా అస్థిరత నెలకొంది. కన్సర్వేటివ్ పార్టీ నుంచి కొత్త ప్రధానమంత్రిని ఎన్నికోవటం మానుకొని సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని లేబర్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే లేబర్ పార్టీ డిమాండ్ పట్టించుకునే పరిస్థితి లేదు. కన్జర్వేటివ్ పార్టీకి తగిన బలం ఉన్నందున ఎన్నికలు జరిగే అవకాశం లేదు. బ్రిటన్ లో 2025 లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి 2025 వరకు అవకాశం ఉంది.

సెప్టెంబరు 7న యూకే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన లిజ్ ట్రస్ కేవలం 44 రోజులకే రాజీనామా చేయడం గమనార్హం. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. ఇప్పటి వరకూ ఈ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జార్జ్ కానింగ్‌ క్షయ వ్యాధి బారినపడి తీవ్రం కావడంతో ఆయన మరణించారు.

పార్టీ గేట్ కుంభకోణం కారణంగా ప్రధాని పదవిని బోరిస్ జాన్సన్ కోల్పోవాల్సి వచ్చింది. ఆయన రాజీనామా అనంతరం కొత్త ప్రధాని ఎంపిక కోసం కన్జర్వేటివ్ పార్టీలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ విజయం సాధించారు. అనేక సవాళ్లు, యూకే ప్రజల అచంచల విశ్వాసం మధ్య యూకే ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె సారథ్యంలోని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. లిజ్ ట్రస్ తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

ప్రపంచ దేశాలను ఆర్ధిక మాంద్యం చుట్టుముడుతున్న తరుణంలో లిజ్ ట్రస్ నిర్ణయాలు దుమారం లేపాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయి బ్రిటన్లో విద్యుత్ బిల్లులు ఆకాశాన్నంటాయి. దీన్నుంచి గట్టెక్కేందుకు లిజ్ ట్రస్ ఇటీవలి మినీ బడ్జెట్ లో సామాన్య ప్రజలతో పాటు ధనిక వర్గాలకు కూడా ఇందన రాయితీ ఇవ్వటం విమర్శలకు తెరలేపింది. ఈ నిర్ణయంతో ప్రతికూల ప్రభావం చూపి డాలర్ తో పౌండ్ విలువ క్షీణించింది. దీంతో  విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలే లిజ్ ట్రస్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ విమర్శలపై రెండు రోజుల కిందట ట్రస్ స్పందిస్తూ.. పెద్ద తప్పు జరిగిపోయిందని, ఆ తప్పు చాలా దూరం వెళ్లిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘‘జరిగిన పొరపాట్లకు క్షమించండి.. ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆ పరిణామాలు అతి వేగంగా చాలా దూరం వెళ్లాయి.. అందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. కాస్త సమయం ఇవ్వండి.. అన్నీ చక్కబెడతాం’’ అని ప్రకటించారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ట్రస్‌ను ఎన్నుకుని తప్పిదం చేశామన్న అభిప్రాయంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీలోని వంద మంది ఎంపీలు.. అవిశ్వాసం ద్వారా ఆమెను గద్దె దించే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆమెను పదవి నుంచి తప్పించడానికి పావులు కదుపుతున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, వారికి అవకాశం ఇవ్వకుండా ఆమె రాజీనామా చేశారు.

బడ్జెట్ తర్వాత ఊహించని పరిణామాలతో క్వాసీని పదవి నుంచి తప్పించి, ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్‌ను లిజ్‌ ట్రస్‌ నియమించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో 62% మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది.

మరోసారి తెరపైకి రిషి సునాక్

లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో రిషి సునాక్ పేరు మరోసై తెరమీదకు వచ్చింది. అయితే జాత్యాహంకారం అధికంగా ప్రదర్శించే ఆంగ్లేయులు భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ను అంగీకరించటం అనుమానమే. రిషి సునాక్ ముక్కు సూటిగా మాట్లాడతారనే పేరుంది. ఇటీవలి టోరి ఎన్నికల్లో హామీలు గుప్పించిన లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపిన పార్టీ శ్రేణులు వాస్తవాన్ని నిర్భయంగా చెప్పిన రిషి సునాక్ ను అంగీకరించ లేదు. పన్నులు తగ్గిస్తే దేశం ఆర్థికంగా అనిశ్చితిలోకి జారుతుందని హెచ్చరించిన సునాక్ వ్యాఖ్యలే ఇప్పుడు నిజం అయ్యాయి. ప్రధానిగా రిషి సునాక్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా… ఏం జరుగునుందో మరో వారం రోజుల్లో తేలనుంది.

Also Read : బ్రిటన్‌ ప్రధాని పదవికి అడుగు దూరంలో రిషి సునాక్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com