Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబిల్ బోర్డులపై మెరుస్తున్న మాణిక్యాలు

బిల్ బోర్డులపై మెరుస్తున్న మాణిక్యాలు

From Roots: ఆ చిన్నారి ధగ ధగా మెరిసిపోతోంది. అందమైన ఆమె ముఖం చిరునవ్వుతో వెలిగిపోతోంది. అమ్మానాన్నలు ప్రముఖ నటులు. అందం, ఐశ్వర్యం.. దేనికీ లోటులేదు. అలాంటిచోట చిన్నతనం నుంచే వారి అడుగుల్లో నడవడం ట్రెండీ గానే ఉంది. ఇలా ఈ మధ్య సెలెబ్రిటీల పిల్లలు పుడుతూనే సిల్వర్ లేదా గోల్డ్ …స్పూన్ కాదు, స్క్రీన్ తో పుడుతున్నారు. చిన్న వయసులోనే అవలీలగా డైలాగ్స్ చెప్పేస్తున్నారు. తల్లిదండ్రుల్ని మించిపోయి పదేళ్లకే ప్రముఖులై అన్ని మాధ్యమాల్లో కనిపిస్తున్నారు.

ఈ మధ్యే ప్రముఖ నటుడు మహేష్ బాబు కుమార్తె సితార వాణిజ్య ప్రకటన అమెరికా బిల్ బోర్డు పై దర్శనమివ్వడం, ఆమె మీడియా సమావేశాలు, చిలకపలుకులు అన్నీ మురిపెంగా చూశాం. మరి వీరి బాల్యం మాటేమిటి అనేవారూ ఉన్నారు. వారి అమ్మానాన్నలకు ఇష్టమైంది. మనకెందుకు? కానీ ఇంతకన్నా బలంగా మనసును ఆకట్టుకునే మరో రెండు కథనాలు …

ప్రిన్సెస్ ఫ్రమ్ స్లమ్
ఎటువంటి నేపథ్యం లేకుండా మోడల్ గా రాణిస్తున్న ‘ ప్రిన్సెస్ ఫ్రమ్ స్లమ్’ మలీషా కర్వా జీవితం సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. కలలు నిజం చేసుకోవడానికి ఒక్క అవకాశం వస్తే చాలని నిరూపించిందీ 14 ఏళ్ళ అమ్మాయి. ముంబై మురికివాడ ధారావి లో పుట్టి పెరిగిన మలీషా జీవితం బ్రిటిష్ నటుడు రాబర్ట్ హాఫ్ మన్ ని కలిసాకే మలుపు తిరిగింది. కరోనా కారణంగా భారత దేశంలో ఉండిపోయిన రాబర్ట్ ఒకరోజు అనుకోకుండా మలీషా ని కలిసాడు. చుట్టూ దుర్భర పరిస్థితులున్నా నవ్వుతూ ఉన్న ఆ పాపని చూసి ముచ్చట పడ్డాడు. ఏం చేయాలని ఉందని అడిగాడు. మంచి మోడల్ అవాలని ఉందన్న ఆమె కలకు రూపం ఇవ్వాలనుకున్నాడు. ఆమెకు చక్కటి భవిష్యత్తు ఉందని, అందుకు తాను చేయూత నిస్తానని ఆమె తండ్రికి చెప్పి ఒప్పించాడు.

మలీషా పేరిట ఇన్స్టాగ్రామ్ పేజీ తెరిచాడు. గో ఫండ్ మీ పేజీ ద్వారా నిధులు సేకరించడానికి పూనుకున్నాడు. త్వరలోనే మలీషా కు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. వచ్చిన సొమ్ము నాలుగు భాగాలుగా ఆమె ఖర్చులకు, కుటుంబం కోసం, చదువుకు, ప్రయాణాలకు సరిపడేలా రాబర్ట్ జాగ్రత్త తీసుకున్నాడు. తానే మలీషా మేనేజర్ గా ఆమె వ్యవహారాలు చూడటమే కాక తన బృందానికీ ఆమె బాధ్యత అప్పగించాడు. ఎట్టి పరిస్థితులలోనూ మలీషా చదువు ఆగకుండా ఏర్పాటు చేసాడు. అతని కృషి ఫలించి మలీషాకు చక్కటి మోడలింగ్ అవకాశాలు లభించాయి. ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ పై ఆమె చిత్రంతో అభిమానులూ ఏర్పడ్డారు. ప్రస్తుతం ఈమె ఇంస్టా పేజీకి రెండులక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా మలీషా ను ఎంచుకోవడం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఓ పక్క చదువుకుంటూనే మోడలింగ్ చేస్తూ కలలను సాకారం చేసుకుంటున్న మలీషా, ఆమెకు చేయూత నిచ్చిన రాబర్ట్ అభినందనార్హులు.

ఆఫ్రికా బిల్ బోర్డుపై…
దక్షిణాఫ్రికాలో అల్బనీ బ్రాండ్ బ్రెడ్ పాపులర్. ఒక ఒంటరితల్లి సంతానం అయిదేళ్ల లేతుకుకన్య. వర్షాకాలంలో ఒకనాటి సాయంత్రం బురద నీటిలో నడుస్తూ బ్రెడ్ కొనుక్కోవడానికి వెళ్ళింది. ఆల్బనీ బ్రెడ్ కొనుక్కుని ఆనందంగా నడుస్తూ వస్తుంటే ఆమె బంధువు చూసి ఆ పాప చిరునవ్వుల సిరులను కెమెరాలో బంధించాడు. అంతే కాదు ఆ ఫోటోలు, వీడియో సామజిక మాధ్యమాల్లో పెట్టాడు. నిమిషాల్లో ఎందరో ఆ చిన్నారి నవ్వుకు అభిమానులయ్యారు. ఇన్నాళ్ళకి ఆ బ్రెడ్ కి తగిన ఫోటో అంటూ స్పందించారు. ఆ తర్వాత ఊళ్ళో ఎక్కడ చూసిన ఆ ఫోటోనే. అంతేకాదు ఆ పాపతో బిల్ బోర్డు చెయ్యమని ఆల్బనీ కంపెనీవారిని కోరారు. స్పందించిన కంపెనీ పాప తల్లిని సంప్రదించి బిల్ బోర్డు పెట్టింది. అంతేకాదు, ఆమె తల్లికి ఇల్లు ఏర్పాటు చేసింది. చిన్నారి చదువుకూ ఏర్పాట్లు చేసింది. ఇక ఆ చిన్నారి నవ్వులు పంచుతూనే ఉంటుంది బిల్ బోర్డు పైనా, బయటా కూడా.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్