ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని మొత్తం 61 నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించగా 2.24 కోట్ల మంది ఓటర్లు వోటు హక్కు వినియోగించుకున్నారు. ఐదో విడత బరిలో 692 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ప్రయాగ్ రాజ్, అమేఠీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఇవి కాకుండా సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రైచ్, శ్రావస్తి, గోండా జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కౌశాంబి జిల్లాలోని సిరతు అసెంబ్లీ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అలహాబాద్ వెస్ట్ నుంచి సిద్ధార్థ్ నాథ్ సింగ్, పట్టి నుంచి రాజేంద్ర సింగ్, నంద్ గోపాల్ గుప్తా పోటీలో ఉన్నారు. ప్రతాప్‌గఢ్‌లోని రాంపూర్ ఖాస్ స్థానం నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా మోనా బరిలో ఉన్నారు. వీరంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.ప్రతాప్‌గఢ్ జిల్లా కుందా స్ధానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి గుల్షన్ యాదవ్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. అయితే గుల్షన్ యాదవ్‌కు ఎటువంటి గాయాలవ్వలేదు. ఈ ఘటనలో వాహనం ధ్వంసమైంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ప్రస్తుతం ఐదో దశ పోలింగ్ పూర్తైంది. మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల పోలింగ్ జరగనుంది.
Also Read : ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం
Post Views: 68