Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగుండెపోట్లు అన్నిటికీ వ్యాక్సిన్ కారణమా?

గుండెపోట్లు అన్నిటికీ వ్యాక్సిన్ కారణమా?

Facts- Rumors: 2006 సమయంలో మేము క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డాక్టర్లుగా పనిచేస్తున్న కాలంలో ఒక నైట్ డ్యూటీలో కనీసం ఒకటి రెండు Brought dead కేసులు చూసేవాళ్ళం. అంటే వాళ్ళు అందరూ సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంవలన ఆసుపత్రికి తీసుకొచ్చే లోపలే చనిపోయినవారు. ఒకరోజులో దాదాపు ఒక్కోసారి ఐదారు దాకా వీటి సంఖ్య ఉండేది. అంటే ఇది చాలా ఎక్కువ. ఇది కేవలం ఒక ఆసుపత్రిలో మాత్రమే వచ్చే కేసులు. అన్ని ఆసుపత్రులను కలిపితే ఈ సంఖ్య మరెంతగా ఉండేదో!

ఇపుడేమైంది?
అప్పటికీ ఇప్పటికీ  తేడా ఏంటంటే ఆ సడెన్ కార్డియాక్ డెత్ ల గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఇపుడు పెరిగిన మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, న్యూస్ యాప్స్ వలన ప్రతీ మరణం రికార్డవుతోంది. ఇది ఒకందుకు మంచిది. ఎందుకంటే అసలెంత కార్డియాక్ రిస్క్ సమాజంలో పెరిగిందో తెలియజేసేందుకు డాక్టర్లకు, హెల్త్ కేర్ ప్రొవైడర్లకు, ప్రభుత్వ పాలసీ మేకర్స్ కు ఉపయోగపడుతుంది.

కానీ మరో కోణంలో  చూస్తే…. ఇది చాలా విపరిణామాలకు దారి తీస్తోంది.   ఒకప్పుడు బంధుమిత్రులకు తప్ప మిగతా జనాలకు తెలియని మరణాలు ఈ న్యూస్ విప్లవం వలన జన సామాన్యానికి తెలిసేలా చేయడంతో, ఒక సందిగ్ధత… ఒక ప్యానిక్ పరిస్థితిని కలగజేస్తుంది. మరణాల రిపోర్టింగ్ మనకు కరోనా కాలంనుంచే పెరిగింది.

దీనిని ఎదుర్కోవడం ఎలా?
మన తెలుగు రాష్ట్రాల్లో  పదుల సంఖ్యలో న్యూస్ యాప్ లు ఉన్నాయి. పేపర్లు, వెబ్ సైట్లు, టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఆరోగ్య సంబంధ విషయాలను పబ్లిష్ చేయడంలో ఈ మీడియా సంస్థలు వేటిలో డాక్టర్లు ఉద్యోగులు కాదు. హెల్త్ డెస్క్ లలో ప్రొఫెషనలిజం లోపం…  వారు ఆ వార్తను రాసే విధానంలోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా సెన్షేషనలిజం కోరుకునే వార్తా ఛానల్స్, న్యూస్ యాప్స్ తమ ఇష్టమున్న థంబ్ నెయిల్స్ పెడుతూ హెడింగ్ లను కూడా భయం గొల్పేలా రాస్తున్నాయి. తమకు తెలియకుండా సమాజానికి ఇవి కలగజేసే చేటును వారికి వివరించి చెప్పగల మెకానిజం మనకు లేదు.

అంతర్జాతీయ మీడియా సంస్థలైన CNN Health, New York times Health, Mayo clinic news network, BBC health, health line వంటి పత్రికలు యాప్ లు తమతమ హెల్త్ డెస్కులలో డాక్టర్లను తప్పనిసరిగా నియమించుకుంటాయి.

బైటకు వెళ్ళే ప్రతీ ఆరోగ్య సంబంధ అంశం ఆథెంటిక్ గానూ, సరైన సమాచారంగానూ, చదివిన జనసామాన్యంలో ఒక శాస్త్రీయ అవగాహనను పెంపొంచేదిగానూ, అపోహలను తొలగించి వారిని సాధికారం చేసే దిశలో చక్కటి చర్యలు తీసుకుంటారు. మన దగ్గర ఇది ప్రధానమైన లోపం.

ఆరోగ్య సంబంధ విషయాలను స‌రైన పద్ధతిలో ప్రెజెంట్ చేయకపోతే , ఆ  చర్య… ప్రజానీకం అస్థవ్యస్థ నిర్ణయాలను తీసుకునేందుకు.. సమాజంలో  సూడో సైన్సు ప్రబలడానికి, పుకార్లను వ్యాప్తిచేసేందుకు దోహదం చేస్తుంది.

మీడియా చాలా బలమైనది. ప్రజలకు సరైన అవగాహన కలిగించగల సత్తా ఒక్క మీడియాకు మాత్రమే ఉంది. అది తన శక్తులను కేవలం పుకార్లను వ్యాపింపజేయడానికి పూనుకోవడం దారుణమైన విషయం.

ఇపుడు పెరిగిన రిపోర్టింగ్ విషయమే తీసుకుంటే, అకస్మాత్తుగా గుండెపోటు మరణాలు పెరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐతే ఈ రిపోర్ట్ చేసినవారు సత్యానికంటే సెన్షేషనలిజంను ఆశ్రయించడం కనిపిస్తోంది.

ఒక వ్యక్తి అకస్మాత్తుగా అలా కుప్పకూలిపోయాడని రాసే రాతలలో నిజానిజాలు చూడవలసి ఉంటుంది.

అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు ఉండవచ్చు. తప్పుడు సమాచారంతో మందులు ఆపేసిన వారు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండెజబ్బులే కావొచ్చు. CRHD కావొచ్చు. యువకుల్లో HOCM కావొచ్చు,  Aortic stenosis కావొచ్చు. Aortic dissection కావొచ్చు. Alcoholic Dilated cardiomyopathy లు కావొచ్చు, అకస్మాత్తుగా ఊడిపడే అరిథ్మియాలు కావొచ్చు. పుట్టినప్పుడే గుండె రక్తనాళాల్లో ఉండే లోపాలు కావొచ్చు.

ఇలా ఎన్నో రకాల కారణాల వలన గుండె అకస్మాత్తుగా ఆగిపోతూ ఉంటుంది. ఇపుడు అన్నింటినీ “గుండెపోటు” Heart attack అని జమకట్టేస్తున్నారంటే ఏమని అర్థం? వారికి సెన్షేషనలిజం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో లేదని…

దీని వలన అయ్యో గుండెపోట్లు పెరిగిపోతున్నాయంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి.

గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇపుడు అన్నింటికీ ఒకే కారణం. వ్యాక్సిన్  అని మరో అమానవీయ ప్రచారం.

ఒక తప్పుడు విషయాన్ని నిజంగా తమకు తెలిసినట్టే మాట్లాడేవారిని ఏమనాలి. ఎలా పడితే అలా మందులను, పరిహారాలను సూచించే వారిని ఏమనాలి? దేశంలో ఎప్పటినుండో గుండె జబ్బుల మరణాలు పైన ఉదాహరించిన అనేక  కారణాల జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనిని వ్యాక్సిన్లతో  ముడిపెట్టడం వలన దేశ వ్యాప్తంగా కోటాను కోట్లలో  వ్యాక్సిన్లు  వేసుకున్న వారి మనఃస్థితి ఏమిటి? ఇందులో బీపీలు, షుగర్లు ఉండి బతకీడుస్తున్న సీనియర్ సిటిజన్ల పరిస్థితి ఏంటిది?

జబ్బులతోపాటు జంటను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న పెద్దమనుషులు కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో ఉంటే వారిని తప్పుడు సమాచారంతో బెంబేలెత్తించేవారిని ఏమనాలి?. వారిగోడును ఎవరితో చెప్పుకోవాలి? ఇంతగా వొట్టిపోయిందా మన సమాజం అనిపిస్తుంది. ఆలోచించలేదా? పెద్దలను, సమాజంలోని బలహీనులను గౌరవించడం అంటే వారిని భయభ్రాంతులకు లోనుచేయడమా? ఇదేం శాడిజం? దీనికి వాక్సిన్లతో లింకు పెడుతూ “మేమూ పోతాం మనమూ పోతాం మీరూ పోతారు” అంటూ భయపడటం భయపెట్టడం అదేదో సరదా వ్యవహారం అన్నట్లు పోస్టులు రాసేవారిని ఏమనాలి?

Cardiac Arrests

మిత్రులారా ఆలోచించండి!  వ్యాక్సిన్లకూ, గుండెజబ్బులకూ ఎలాంటి సంబంధం లేదని సైంటిఫిక్ కమ్యూనిటి ప్రపంచవ్యాప్తంగా చెబుతూనే ఉంది. గుండె జబ్బులు రాను రానూ పెరుగుతున్నాయనీ ఇదే సైంటిఫిక్ కమ్యూనిటీ గత ఇరవై యేళ్ళు గా చెబుతూనే ఉంది. హెచ్చరిస్తూనే ఉంది. వీటిని ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలూ, ప్రజలూ ఈరోజు దీనిని అన్యాయంగా వాక్సిన్లకు అంటగట్టి మరింత భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

ఒక రెండు అంశాలు ఒకేసారి జరుగుతున్నపుడు ఆ రెంటికి సంబందాన్ని ఊహించడం అన్నది ఒక ఆలోచనాధోరణిలోని లోపం. దీనిని అసోసియేషన్ ఫాలసీ (Association Fallacy) అంటారు.

దీనికి లోనై వాక్సిన్ వేసుకున్న కోట్లాది ప్రజల జీవితసాఫల్యత మీద దెబ్బ కొట్టి వారి QUALITY OF LIFE ని అనవసర అపోహలతో దారుణంగా దెబ్బతీస్తున్నారు. ప్రశాంతంగా జీవించవలసిన వారి హక్కులను బలవంతంగా గుంజుకుని హాసిస్తున్నారు. ఇది దయచేసి చేయకండి.

ప్రపంచ వ్యాప్తంగా ఏ కార్డియాలజీ సొసైటీ కూడా వాక్సీన్ లకు గుండెపోటులకు సంబంధాన్ని ధృవీకరించలేదు. నిర్ద్వంద్వంగా కొట్టిపాడేసింది.

ఎవరో ఒకరిద్దరు డాక్టర్లు చెప్పిన విషయాలను అభిప్రాయాలను అద్భుతమైన సైన్సు అనుకునే దశనుండి విముక్తి చెందండి.

–  డా. విరించి విరివింటి

Also Read :

గుండె గుబులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్