Digi Currency: సాధారణంగా ఎల్ కే జీ లో చేరితే పి హెచ్ డి దాకా తరగతులు, తరగతి గదులు, భవనాలు మారుతూ ఉండవచ్చు. మారడం ఇష్టంలేని వారు ఒకే తరగతిలో పదేళ్లయినా ఉండిపోవచ్చు. ఈ తరగతులకు అతీతమయినది మధ్య తరగతి. కొంచెమే అతీతమయినది ఎగువ మధ్య తరగతి. మరీ దుర్భరమయినది దిగువ మధ్య తరగతి.
భారత దేశ 130 కోట్ల జనాభాలో ఎక్కువ శాతం ఈ మూడు తరగతుల మధ్యలోనే బతుకు పాఠాలను చాలా కష్టంగా చదువుకుంటూ ఉంటారు. సృజనాత్మక రచయితలందరి ఏకాభిప్రాయం ప్రకారం మధ్య తరగతి స్వరూప స్వభావాలు, లక్షణాలు ఇలా ఉంటాయి.
1 . నెల జీతమే ఆధారం.
2 . జీతం రాగానే పాలు, పేపర్, కరెంట్, ఫోన్, ఇంటర్నెట్, హౌసింగ్ లోన్ లేదా ఇంటి అద్దె, వెహికిల్ లోన్ ఈ ఎం ఐ పోగా మిగిలేది ఉండదు.
3 . పదో పరకో మిగిలినా ఏ ఆసుపత్రి ఖర్చులో లేక ఇంకేదో అనుకోని ఖర్చు ఉండనే ఉంటుంది.
4 . నెల సగం గడవగానే ఎంతో కొంత అప్పులు చేయక తప్పని తిప్పలు.
5. ఆదాయానికి- ఖర్చుకు మధ్య ఎప్పటికీ పొత్తు కుదరదు.
6 . ఊపర్ షేర్వాణీ- అందర్ పరేషానీ.
7. పిల్లల చదువులకు, అమెరికా ఎం ఎస్ కు పాతిక లక్షల బ్యాంక్ లోన్ తప్పనిసరి.
8. అమ్మాయి పెళ్లికి ఆస్తుల అమ్మకం, అయినా చాలకపోతే అప్పులు.
9 . పెద్ద రోగమొస్తే దేవుడే దిక్కు.
ఇంకా అంతర్గతంగా మధ్య తరగతుల లక్షణాలు చాలా ఉన్నాయి కానీ- వారి మనోభావాలను గౌరవించి ఇక్కడికి వదిలేయడం మంచిది.
మధ్య తరగతి కోసం బడ్జెట్లో ఎన్నో పెడుతుంటారు. అవన్నీ మధ్య తరగతికి అందకుండా మధ్యలోనే మాయమవుతున్నాయేమోనని మధ్యతరగతి అనుమానం. కేంద్ర ఆర్థిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతుండగా టీ వీ ల్లో వచ్చిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఒక మధ్య తరగతి కుటుంబం తేరిపార చూసింది. ఒళ్లంతా చెవులు చేసుకుని విన్నది. వారికి అర్థమయినట్లు వారి భాషలో వారు బడ్జెట్ ను అన్వయించుకున్నారు. అది ఇక్కడ అనవసరం. ఒక సగటు మధ్య తరగతి కుటుంబంలో భర్త, భార్య, కాలేజీకెళ్లే కూతురు, స్కూల్ కెళ్లే కొడుకు- బడ్జెట్ తరువాత టీ వీ ల్లో చూసిన చర్చలు, పేపర్లలో చదివిన వార్తల సారమిది.
1 . ఇది వందేళ్ల బడ్జెట్ అంటే…వందేళ్లకు సరిపడా ఇదేనేమో అని మొదట భయపడ్డారు. మరో పాతికేళ్ల తరువాత రాబోయే వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల దిశగా సాగే బడ్జెట్ అని నెమ్మదిగా అర్థమయ్యింది.
2. రాబడిమీద, లాభాల మీద ఆదాయపు పన్ను సాధారణం. డిజిటల్ లావాదేవీల మీద, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ బదిలీల మీద పన్నులు ప్రారంభం. వర్చువల్ ఊహల మీద కూడా భవిష్యత్తులో పన్నులు వేయవచ్చు. అందుకే మీడియా డిజి డల్ బడ్జెట్ అని పెదవి విరిచింది.
3 . పన్నులు పెరిగే వస్తువులు ఎలాగూ కొనలేము.
4 . పన్నులు తగ్గించిన వస్తువులు రత్నాలు, వజ్రాలు, ఇంగువ, మొబైల్ ఫోన్లు, కోకో గింజలు, పెట్రో కెమికల్స్, తుక్కు ఇనుము ఎంతయినా కొనుక్కోవచ్చు. రత్నాలు వజ్రాలతో మొదలయిన లిస్ట్ తుక్కు ఇనుము దగ్గర ఆగడంలో చివరకు మిగిలేది అంతా తుక్కే అన్న లోహ వేదాంత తాత్విక ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదన ఏదో దాగి ఉంది.
5 . ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ఆగదు. మన యోగక్షేమం వహామ్యహం అని ఇన్నేళ్ళుగా ప్రతిన బూనిన ఎల్ ఐ సి యోగక్షేమం ఇప్పుడు అయోమయంలో పడింది. ఎల్ ఐ సి దీపం ఆరిపోకుండా అడ్డు పెట్టే చేతులు ఎక్కడున్నాయో తెలియడం లేదు.
6 . ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి నిరర్థక, అనర్థక, అర్థరహిత, అర్థ వ్యతిరేక పదాలన్నిటినీ దశల వారీగా అర్థశాస్త్ర నిఘంటువుల నుండి ఉపసంహరించడానికి శబ్దార్థ, ప్రతిపదార్థ, అర్థాన్వయ, అనంతార్థ కోవిదులతో ఒక అర్థ నిర్భరార్థం శబ్ద్ కోశ్ ఉపసంహరణ్ అభియాన్ ఏర్పాటు.
7 . స్వదేశీ స్వయం ప్రకటిత ఆత్మావాహన్ వాహనంలో విదేశీ ఆత్మ దుర్భర్ ఆత్మల ప్రవేశానికి ఆంక్షల సడలింపు.
సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీద పడ్డా, మిన్ను విరిగి మీద పడ్డా చలించనిది మధ్య తరగతి. దెబ్బలు తగిలి తగిలి మధ్య తరగతి గుండె ఎప్పుడో బండబారిపోయింది. ఇప్పుడు తాయిలాలకు పొంగిపోయి చేయి చాచదు. దెబ్బలకు కుంగిపోయి నడక ఆపదు.
ఎంత చదివినా ఇంకా ఎంతో చదవాల్సింది మిగిలిపోయేదే మధ్యతరగతి. మధ్య తరగతి బడ్జెట్ మానసిక ప్లాన్ ముందు ప్రపంచ ఆర్థిక శాస్త్ర మహా గ్రంథాలన్నీ చిన్నబోతాయి.
అన్నట్లు-
మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఆర్థిక విద్యావేత్త. మహాభారత శాంతి పర్వాన్ని ప్రస్తావిస్తూ ఆమె సమర్పించిన బడ్జెట్ ద్వారా…
శాంతి ఎవరికి?
అశాంతి ఎవరికి?
భ్రాంతి ఎవరికి?
అన్నవే మిలియన్ డిజిటల్ డాలర్ ప్రశ్నలు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : డ్రైవర్లు లేకుండా తిరిగే వాహనాలు