ఆర్మీ రిక్రూట్ మెంట్ లోకోసం ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం ఈ రోజు (శనివారం) సమీక్ష నిర్వహించనుంది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు దావానలంలా వ్యాపించటంతో కేంద్రం దిగి వచ్చింది. ఈ పథకంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో ఈ రోజు సమావేశమై సమీక్షించనున్నారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతపై పరిశీలనకు వెళ్ళిన లధాక్ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు.
అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలలో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా యువత నుంచి అగ్నిపథ్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
అగ్నిపథ్ పేరుతో ఆర్మీని అవమానించడమేనని విపక్షాలు విమర్శలు చేశాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనకు తలొగ్గి మోడీ ఆ చట్టాలను వెనక్కు తీసుకోవడమే కాక రైతులకు క్షమాపణ చెప్పిన సంగతి విదితమే. ఇప్పుడు అగ్నిపథ్ విషయంలో కూడా వెల్లువెత్తిన వ్యతిరేకతకు తలొగ్గి కేంద్రం సమీక్షించాలని నిర్ణయించింది.
Also Read : తెలంగాణకు పాకిన ‘అగ్ని’ కీలలు