రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆయనకు చినజీయర్ స్వామి, మై హోం రామేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు.
ఆశ్రమానికి చేరుకున్న అమిత్ షా తిరునామం ధరించి ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాలను సందర్శించారు. శ్రీ రామానుజాచార్యుల సమతా మూర్తి విగ్రహాన్ని ఆయన దర్శనం చేసుకున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం ముచ్చింతల్ ఆశ్రమం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమతాముర్తి గొప్పతనం కీర్తించారు. రామానుజ చార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారన్నారు . జీవితంలో ఒక్కసారైనా సమతా మూర్తిని దర్శించుకోవాలన్నారు. శంకరాచార్యులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడారని గుర్తు చేశారు. దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతా కేంద్రం ఖ్యాతి గడిస్తుందన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అధికారులు ఘన స్వాగతం పలికారు.