Sunday, January 19, 2025
HomeTrending Newsవిభజన హామీలు త్వరగా తేల్చండి: ఏపీ వినతి

విభజన హామీలు త్వరగా తేల్చండి: ఏపీ వినతి

Home Ministry Review: ఏపీకి రావాల్సిన 2014-15 రిసోర్సు గ్యాప్ ఫండింగ్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా… ఢిల్లీ నుండి ఏపి, తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై వివిధ పెండింగ్, ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపిలో గ్రీన్ ఫీల్డు క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను సమీర్ శర్మ ప్రస్తావించారు.

అలాగే కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు… విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను కూడా సమీర్ శర్మ వివరించారు, దుగ్గరాజు పట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం-చైన్నైపారిశ్రామిక కారిడార్, కేంద్రం నుండి రావాల్సిన పన్ను రాయితీలు తదితర అంశాలను సిఎస్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృష్టికి తెచ్చారు.

షెడ్యూల్ 9,10లలో పేర్కొన్న సంస్థలలకు సంబంధించిన వివాదాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్- దాని సబ్సిడరీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ భవన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 50, 51, 56లో పేర్కొన్న విధంగా పన్ను బకాయిలు, పన్ను రీఫండ్ అంశాలపైనా సమీక్షించారు.

అదే విధంగా పునర్విభజన చట్టంలో ఎక్కడా లిస్ట్ కాబడని ఇనిస్టిట్యూషన్ల ఎపాయింట్మెంట్, డివిజన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్సు, బ్యాంకు డిపాజిట్లు, తెలంగాణా డిస్కం ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇరువురు సిఎస్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అజయ్ భల్లా మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను సామరస్య పూర్వకంగా పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్,ఎస్ఆర్సి ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి,ఎ పి జెన్ కో ఎండి శ్రీధర్, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా,ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సివిల్ సప్లయిస్ కమీషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొనగా ఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, వీడియో లింక్ ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్