Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమిలే సుర్ మేరే తుమారా!

మిలే సుర్ మేరే తుమారా!

Artists & Artisans: ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. 1950, 51 లో మొదట ఆంధ్రజ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చినది 1952లో పుస్తకంగా ప్రచురితమయింది. దాదాపు డెబ్బయ్ అయిదేళ్ల కిందటిది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల మధ్య మన చదువుల పరిస్థితి, ఇంగ్లీషు చదువులు, ఆర్థిక మాంద్యంలో చదువు- ఉద్యోగాల తపన, మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు చదువు కోసం పడే ఆరాటాలు…ఇలా చదువుతో ముడిపడ్డ అనేక అంశాలను “సుందరం” పాత్ర చుట్టూ అల్లిన నవల ఇది.

త్యంత తేలికయిన తెలుగు మాటలతో అనన్యసామాన్యమయిన భావసముద్రాన్ని ఎలా సృష్టించాలో నేర్చుకోవాలనుకున్నవారు, తెలుసుకోవాలనుకున్నవారు తప్పనిసరిగా చదవాల్సిన రచనలు కొడవటిగంటివి.

వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో “ఈ చదువులు మాకొద్దు” సినిమా 1984లో వచ్చింది. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వాలను ఎలా శాసిస్తున్నాయో లేదా ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యను ఎలా ప్రోత్సహిస్తున్నాయో ఇప్పుడు ధనుష్ హీరోగా “సార్” సినిమా వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ లో “కోటా ఫ్యాక్టరీ” పేరిట ఐ ఐ టి కోచింగ్ ముసుగులో చదువుల విధ్వంసం గురించిన సిరీస్ అనంతంగా నడుస్తూనే ఉంది.

తెలుగులో చదువు అంటే (Education) నామవాచకం;
read అనే ఆదేశాత్మక క్రియా పదం కూడా.
చదువు చదివి ఒకనాటికి ఆపేసేది కాదు కాబట్టి చచ్చేదాకా చదువుతూనే ఉండాలన్న అంతరార్థమేదో ఉన్నట్లుంది “చదువు” మాటలో! చదువు వల్ల వ్యుత్పత్తి, రాబడి, ప్రయోజనాలు లెక్కపెట్టే ఈరోజుల్లో చదువు మాట వ్యుత్పత్తి అర్థాల జోలికి వెళ్లడం కంఠ శోష.

భారతీయ పాత విద్యావిధానంలో పుస్తకాల ప్రమేయం లేకుండా ఒకరి నుండి ఒకరు నోటికి నేర్చుకోవడమే ప్రధానంగా ఉండేది. సులభంగా గుర్తు పెట్టుకోవడానికి వీలుగా సకల శాస్త్రాలు శ్లోకాలు, పద్యాల రూపంలోనే ఉండేవి. ఇప్పుడు మనకు అదంతా చాదస్తంగా అనిపించవచ్చు కానీ…కొన్ని వేల ఏళ్ల పాటు విద్యలను ఒక తరం నుండి మరో తరానికి అందించిన శాస్త్రీయమయిన విధానమది. మెదడు జ్ఞాపకశక్తికి ఆకాశమే హద్దు అన్న అప్పటి విద్యా విధానం ఇప్పుడొక జ్ఞాపకం- అంతే.

బ్రిటీషు చదువుల పేరుతో “మెకాలే” విద్యా విధానం భారతీయ విద్యను చంపేసిందా? నిలబెట్టిందా? స్వాతంత్ర్యానికి ముందు మొదలయిన ఈ విద్యా బోధనలో కుట్ర ఉందా? సదుద్దేశం ఉందా? సృజనాత్మకత చచ్చి…రుబ్బుడు రోలు చదువు స్థిరపడిందా? పిల్లల్లో సహజమయిన జ్ఞాపకశక్తికి వేసిన బాటలు బీటలు వారి…మార్కుల అక్రమార్కులు వేసిన వక్రమార్గం పట్టిందా? కోళ్ల ఫారాల్లో పెంచే కోడి పిల్లలకు…కాన్వెంట్ల షెడ్లల్లో పెరిగే పిల్లలకు తేడా లేదా? అన్న ప్రశ్నలకు విడిగా కొన్ని చారిత్రిక ఆధారాలు, డాక్యుమెంట్లు, భారతదేశంలో (1835ప్రాంతాల్లో) పనిచేసిన అప్పటి బ్రిటిషు ప్రభువు లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఇంకెప్పుడయినా చర్చించుకుందాం.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు ముగిసిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు కూడా జరుపుకున్నాం. శతాబ్ది ఉత్సవాల వైపు పరుగులు పెడుతున్నాం. ఇన్నేళ్లకు మన ఉన్నత విద్య చాలా యాంత్రికంగా, జీవం లేనిదిగా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భారతీయత ఏదో లోపించినట్లు కూడా అనిపించినట్లుంది. దాంతో ఇకపై కాలేజీల్లో కళల గురువులను ప్రవేశపెట్టాలని భారతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- యు జి సి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎక్కడికక్కడ వివిధ కళల్లో నిష్ణాతులను ఎంపానెల్ చేసి వారితో కాలేజీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పించాలన్నది యు జి సి ఆలోచన. దీనిద్వారా యు జి సి కోరుకుంటున్నవి ఇవి.

1. స్థానిక కళలతో పరిచయం ఏర్పడుతుంది.
2. సబ్జెక్టు విని విని బోర్ కొట్టినవారికి ఆటవిడుపుగా ఉంటుంది.
3. సృజనాత్మకత పెరుగుతుంది.
4. భారతీయ కళల ఔన్నత్యం, వారసత్వం తెలుస్తాయి.
5. తమ ప్రాంతం మీద మరింత అభిమానం ఏర్పడుతుంది.
6. ఒత్తిడి తగ్గి…విద్యార్థులు ఉల్లాసంగా ఉంటారు.

యు జి సి ఆలోచన మంచిదే. ఆచరణలో దీనికి కాషాయం రంగు అంటుకుని…ఉద్దేశం నీరుకారకుండా ఉండాలని కోరుకుందాం.

(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- యు.జి.సి.కి తెలుగు మాట వాడుకలో ఉన్నట్లు నావరకు తెలీదు. “విశ్వ విద్యాలయాల గ్రాంట్ల కమిషన్” అని మాట ఉంది కానీ అది పూర్తి అనువాదం కాదు. ఎవరూ ఉపయోగిస్తున్నట్లు లేరు. “గ్రాంట్ల” మాటకు తగిన అనువాదం దొరక్క లేదా ప్రయత్నించక…ఆ ఇంగ్లీషు “గ్రాంట్” మీదే ఆధారపడినట్లు ఉన్నాం. దీనికి వాడుకలో అనువాదం ఉండి ఉంటే…నన్ను మన్నించి తెలియజేయగలరు)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

ఆదిభట్లను కొలిచే రాళ్లున్నాయా?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్