Sunday, November 24, 2024

కొండంత బాధ

Nature gets Anger: ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగుబాటు మీద హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటిస్తోంది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ ఇప్పుడు జోషీమఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు చీలిన వీధుల్లో, కూలుతున్న పైకప్పుల్లో మనం తాపీగా వెతుక్కోవచ్చు. అకెడెమిక్ ఇంట్రెస్ట్ కోసం వివరంగా చదువుకోవచ్చు. అనేక కమిటీల నివేదికలు, హెచ్చరికలు ప్రభుత్వ వెబ్ సైట్లలో ఇప్పుడు ఎందుకు మాయం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

జోషిమఠ్ ఇక ఏమాత్రం నివాసయోగ్యం కాదని ఊరు ఊరంతా ఖాళీ చేయించారు. ఇప్పటికి 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల భవిష్యత్తులో ఇంకా ఎంత లోతుకు కుంగుతుందోనని ఆందోళనతో మనం మరింత కుంగిపోవడం తప్ప చేయగలిగింది లేదు.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం లాంటి పర్వత ప్రాంతాల్లో ఇంకెన్ని శాశ్వతంగా ఖాళీ చేయాల్సిన జోషిమఠ్ లు ఉన్నాయన్నదే ఇప్పుడు ఆందోళనపడాల్సిన విషయం. ఒక్క ఉత్తరాఖండ్ లోనే పూర్తయినవి కాక ప్రస్తుతం పనులు జరుగుతున్నవి తొమ్మిది వేల మెగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సగం పూర్తయ్యే దశలో ఉన్నాయి. నాలుగు పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపే చార్ ధామ్ హై వే ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇవి కాక టూరిస్టు ప్రాజెక్టులు లెక్కలేనన్ని.

ఇప్పుడు అర్థమయ్యిందా?
జోషీమఠ్ దానికదిగా కుంగుతోందా?
ఎవరిచేతయినా బలవంతంగా కుంగింపబడుతోందా?
జోషీమఠ్ ఊళ్లో ప్రాణనష్టం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నామని చెప్పుకునే ప్రభుత్వం…ఎముకలు కొరికే చలిలో గూడు వదిలి నీడలేని నిరాశ్రయులకు ఏ భరోసా ఇవ్వగలదు?

పర్వత ప్రాంతాలు… ప్రత్యేకించి హిమాలయ సానువులన్నీ టూరిస్టుల తాకిడితో తీవ్రమయిన ఒత్తిడిలో ఉన్నాయి. దీనికి తోడు హైడెల్ పవర్ ప్రాజెక్టులు, అంతులేని ఆధునిక వసతులకోసం నిర్మాణాలు...కలిపి దేవభూములను నిలువునా ముంచుతున్నాయి.

ఏ ప్రాంతం ఎంత బరువును తట్టుకోగలదో, ఏ వసతులకు ఎంతవరకు అనువో ఈరోజుల్లో శాస్త్రీయంగా నిర్ణయించవచ్చు. పునాదుల అవసరమే లేని చెక్క ఇళ్లు, మట్టి గోడల ఇళ్లు ఉత్తరాఖండ్ కు అవసరమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.

ప్రకృతి మాత్రం ఎంతకని భరిస్తుంది?
దాని సహనానికీ ఒక హద్దుంటుంది. ఎదిగే వింధ్య కొండ ఎత్తును దించడానికి అప్పుడు అగస్త్యుడు ఉత్తర భారతాన్ని వదిలి దక్షిణ భారతానికి వచ్చాడు. ఇప్పుడు కుంగిపోయే ఉత్తరాఖండ్ కొండను పైకి లేపడానికి ఆ అగస్త్యుడే దక్షిణాది వదిలి…మళ్లీ ఉత్తరాదికి వెళ్లాలేమో! ఏమో!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్