Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబారత్ కు ఒత్తెందుకు?

బారత్ కు ఒత్తెందుకు?

ఇంగ్లిష్ లో freedom ను fridom అని కానీ, freedum, fridum, fridam అని కానీ రాస్తే తప్పు. టీచర్లు వెంటనే బెత్తంతో కొడతారు. స్కేల్ తో రాసిన వేళ్లను విరగ్గొడతారు. శిక్షగా Freedom అన్న మాటను వంద సార్లో, వెయ్యి సార్లో రాయించి మనకు ఆ మాట సరిగ్గా వచ్చిందని అనుకునేవరకు మన గుండెల్లో నిద్రపోతారు.

తెలుగులో అయితే ఆ సమస్యే లేదు. “స్వాతంత్య్రం” అన్న మాటను ఎలా అయినా రాసుకునే స్వాతంత్య్రం మనకు 1947 ఆగస్టు పదిహేనున వచ్చింది.

స్వాతంత్రం
స్వతంతం
స్వత్రతంత్రం
స్వతంత్రత
స్వాయంత్రం
స్వయంత్రం… ప్రస్తుతానికి స్వతంత్ర భారతావనిలో స్వాతంత్య్రం  అనే పదానికి పర్యాయపదాలుగా చలామణిలో ఉన్న మాటలు!

ప్రవహించేదే భాష అని సంస్కృతంలో గొప్ప నిర్వచనం. నిలిచి ఉన్న నీరు మురుగు. కాబట్టి ప్రవహించే భాషా స్వాతంత్య్రంలో ప్రజాతంత్ర వ్యవస్థలో స్వాతంత్య్రంలో య ఒత్తు వత్తు ఆరిపోయిందని, స్వతంతంలో ర ఒత్తు- క్రావడి లేదని దాన్ని అక్షర దోషంగా పరిగణించడం మూర్ఖుల, ఛాందసుల పద్ధతి.

ఘటోత్కచుడి ఆస్థాన గురువు చిన్నమయ. “దుష్ట చతుష్టయము” మాటను శిష్యులకు నేర్పబోతే వారు చక్కగా “దుషట చతుషటయము” అని అంటే ఘటోత్కచ ఎస్వీ యార్ పగలబడి నవ్వి…లెస్స…లెస్స…వెయ్యండి వీరికి రెండు వీరతాళ్లు! అని డబుల్ డిగ్రీలు ప్రదానం చేయించాడు. ఈ సందర్భంలోనే “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?” ఘటోత్కచుడి చేత మాటల మాంత్రికుడు పింగళి చెప్పించిన సర్వకాల, సర్వావస్థల భాషా శాస్త్ర మౌలిక సూత్రం అనన్యసామాన్యమైనది. నిత్యస్మరణీయమైనది.

ఆ సూత్రం ప్రకారం మనం తీసుకున్న స్వేచ్ఛ “సేచ్చ” అయినా, “సచ్చ” అయినా వచ్చిన స్వాతంత్ర్యం ఇందుకే అనుకోవాలి తప్ప మరోవిధంగా చింతించి ప్రయోజనం లేదు.

దీనికి ఉదాహరణ కావాలంటే మెదక్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం ముదిరాజ్ లక్షలు, బహుశా కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనల్లో తాటికాయంత అక్షరాలను చూడండి. ఆర్థికలో పొట్టలో చుక్క చుక్కల్లోకి ఎక్కి…”ఆర్ధిక” అయ్యింది.

“దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్ధిక స్వాతంత్రం”
వచ్చింది- అక్షరాలా ఆ ప్రకటన ప్రకారం!

ధర్మవరపు- ఎం ఎస్ ఏదో హాస్య సన్నివేశంలో అనువాదంలో “యూ నో” అంటే…
నీవు కాదు…
కాదు కాదు…
కె ఎన్ ఓ డబ్ల్యూ -know క్నో కాదు
ఎన్ ఓ-no నో
అంటూ నవ్వులు పండించారు.

ఇంగ్లిష్ లో పలికే నో- no లేదో, know తెలుసుకోవడమో రాయడంలో తేడా పాటించాల్సిందే.

మరో ప్రకటనలో ఇంగ్లిష్ back pain ను తెలుగులో
“బ్యాక్ పేన్” అని వెన్నెముకలో చురుకు పుట్టేలా లిప్యంతరీకరించారు!

ఆఫ్టరాల్ దేశభాషలందు లెస్సు తెలుగు!
ఎలా రాసినా పరవాలేదు!

నూటికి నూటొక్క శాతం జనం ఈ ప్రకటనలు చూడరు; చదవరు కాబట్టి బతికిపోతున్నారు! పొరపాటున చూశారో…చదివారో ఎవరి ప్రమేయం, సహాయం అవసరం లేకుండా వారికి వారే సొంతకాళ్ల మీద నేరుగా ఎర్రగడ్డకు పోతారు!

కొసమరక:-
“భారత దేశంలో ఒత్తు తీసేసి బారత దేశం అని నేను రాస్తే రెడ్ పెన్ తో ఇంటూ కొట్టి మార్కులు తగ్గించారు. బారత్ అని రాస్తే మీకేమన్నా పాకిస్థాన్ లా అనిపిస్తోందా?”
అని ఒక తెలుగు విద్యార్థి తెలుగు ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే…ఆ ఉపాధ్యాయుడు ఒత్తున్న భారత మాత కోసం కళ్లల్లో వత్తులేసుకుని తీవ్రంగా అన్వేషిస్తున్నారట!

తల్లీ! ఒత్తున్న భరత మాతా!
ఎక్కడున్నావమ్మా! వత్తావా?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్