Ultra Modern Lady:
“అక్కరకురాదె క్షాత్రము
చిక్కితి కౌరవసభమున చీరను లాగన్
దెక్కెవ్వరునాకు ఇచటన్
నిక్కముగ యనుజనుగాచు నీవే కృష్ణా!
పట్టగలేను కుమితినరి
కట్టగ లేను చెరబట్ట గదిలిన వానిన్
గొట్టగ లేను, మురారీ
చట్టముు దప్పిన సభమున సాయము రారా !”
ఇవీ జూదంలో పాండవులు… పేరులోనే ధర్మాన్ని కల్గియున్న ధర్మజుడు తనను పణంగా పెట్టినప్పుడు వస్త్రాపహరణం సమయాన ద్రౌపది ఆ మాధవుడికి మొరబెట్టుకున్న వేడుకోలు!
ఎలాగైనా పాండవసేనను అవమానపర్చేందుకు కౌరవులు కంకణం కట్టుకున్న సమయాన… విధి ఆడే నాటకంలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం భారతంలో అత్యంత ప్రధానమైంది. కౌరవసేనను చివరకు తుదముట్టించిన అర్జునుడుగానీ, దుర్యోధనుణ్ని ప్రతిన పూనిన మేరకు చీల్చిచెండాడిన భీముడుగానీ… పేరులోనే ధర్మాన్ని కల్గియున్న ధర్మరాజుగానీ… ఎవ్వరూ ఆపలేకపోయిన సన్నివేశమది. శకుని గారడీతో జూదం మిగిల్చిన కన్నీటి అవమాన గాధ అది. అయితే తన భార్యను పణంగా పెట్టి.. జూదంలో సతినే కోల్పోయినా ధర్మజుడంతటివాడు ఆడిన మాట తప్పకుండా చేసిన అనివార్య దైన్యస్థితి అది!
ఇదంతా నాటి భారతమైతే?
వస్త్రాపహరణ ఘట్టంలో పతుల ఆటకు పణంగా అవమానభారాన్ని భరించిన భార్యగా నాటి ద్రౌపది పరిస్థితి.. భార్యను పణంగా పెట్టి పోగొట్టుకున్న నాటి ధర్మజుడి దైన్యస్థితి… ఈ రెండూ కలిసిన ఓ మహిళ కథే నేటి నయా ఉత్తర భారతం!
నాడు జూదం కొంపముంచితే… నేడు ల్యూడో ఆ పని చేసింది.
ఓ ద్రౌపది కథ.. ఓ ధర్మజుడి కథే కాదు… లేటెస్ట్ గా వచ్చిన కంగనా రనౌత్ క్వీన్ కూడా ఈ మహిళ కథలో నిక్షిప్తమై ఉండటమే ఇంత చెప్పుకోవడానికి కారణం!
నాటి జూదం ఘట్టంలో ద్రౌపది… ధర్మజుల పాత్రలు వేర్వేరైతే… ఇక్కడ ఈ మహిళే రెండు పాత్రలూ పోషించడమే ఈ కథలో విశేషం.
ల్యూడో ఆట మాయలో పడి.. తనను తానే పందెంగా పెట్టుకున్న వార్తాకథ ఇది. యూపీ ప్రతాప్ గఢ్ జిల్లా దేవ్ కలీకి చెందిన రేణూకు పెళ్లై.. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భర్తేమో ఉపాధికై రాజస్థాన్ బాటపట్టాడు. రేణూ ఏమో ల్యూడోకు అలవాటైంది. అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. తన ఇంటి యజమానితోనే ఈ ఆటలో ఆమె పోటీ కూడా!
అలా ఉన్న డబ్బంతా పోగొట్టుకుంది. ఇక ఆ ఇంటి యజమానికి తనను తానే పణంగా పెట్టుకుంది. ఆటలో ఓటమితో… ఆ ఇంటి యజమాని చిటికెన వేలు పట్టుకుని ఆయనతో పాటే వెళ్లిపోయింది ఈ అభినవ ద్రౌపదీ ధర్మరాణి!
ఇదేం నాటి మహాభారత పర్వం కాదుకదా… అర్జునుడు విల్లంబులెక్కుబెట్టి కర్ణుణ్ని చంపినట్టు… భీముడు తన గదాఘాతంతో దుర్యోధనుణ్ని మట్టుబెట్టినట్టు..? కాబట్టి రేణూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. కానీ, నాటి పాండవుల కథలా రేణూ భర్త కథ సుఖాంతం కాకపోగా… ఆడిన మాటను తప్పే అలవాటు లేదంటూ నాటి ధర్మజుణ్ని మైమరిపిస్తూ… నాటి ద్రౌపదీ శపథాల్ని దరిచేరనీకుండా… యజమానితోనే ఉండిపోవడమే… ఈ కథకు ఓ విషాద ముగింపు! ఎందుకంటే అగ్నిసాక్షిగా మనువాడిన భర్తను కాదనుకుని… కన్నపిల్లలపై కనీస మమకారం లేకుండా…. తన ల్యూడో దుర్వ్యసనానికి… పైగా ఆడిన మాట తప్పనంటూ వెళ్లిపోయిన రేణూ కథ ఈ సమాజానికి ఇప్పుడో కొత్త ప్రశ్న…?
-రమణ కొంటికర్ల
Also Read :