Friday, January 24, 2025
HomeTrending NewsZoo Upgrade: అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్ ఆధునీకరణ

Zoo Upgrade: అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్ ఆధునీకరణ

అరవై వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన జపాట్ (ZAPAT – Zoos And Parks Authority Of Telangana) పాలక మండలి సమావేశం అరణ్య భవన్ లో జరిగింది.

నెహ్రూ జూ పార్క్ తో పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా జంతు ప్రదర్శనశాలలను మరింత అభివృద్ది చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. కాకతీయ జూ పార్క్- హనుమకొండ, పిల్లలమర్రి మినీజూ పార్క్- మహబూబ్ నగర్, లోయర్ మానేరు డీర్ పార్క్- కరీంనగర్, కిన్నెరసాని డీర్ పార్క్- పాల్వంచలలో జంతు సంరక్షణ- ప్రదర్శన చర్యలు, కేబీఆర్, మృగవని, మహవీర్ హరిణ వసన్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సౌకర్యాల కల్పనపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్ లో సౌకర్యాలను మెరుగు పరచాలని, వన్య ప్రాణుల ఆవాసాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దటం, ఇంకా ఆకర్షణీయమైన జంతువులను దిగుమతి చేసుకోవటం, పులి, సింహం ఎన్ క్లోజర్లను గ్లాస్ పార్టీషన్ తో అతిదగ్గరి నుంచి చూసే ఏర్పాటు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు.

నెహ్రూ జూ పార్క్ లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, మరింత వృద్దికి అవకాశాలపై క్యూరేటర్ ప్రశాంత్ పాటిల్ ప్రజంటేషన్ ఇచ్చారు.
నిపుణుల సూచనలతో వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్ తో పాటు అన్ని జూ పార్క్ లు, నేషనల్ పార్క్ లను, అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను పర్యావరణహితంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఏం. డోబ్రియాల్ అన్నారు.

పెరిగిన యాజమాన్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నెహ్రూ జూ పార్క్ ఎంట్రీ ఛార్జీలను నామమాత్రంగా పెంచేందకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇకపై వారం రోజుల్లో పెద్దలకు 70, సెలవు రోజుల్లో 80 రూపాయాలు, పిల్లలకు 45, సెలవు రోజుల్లో 55 రుసుముగా నిర్ణయించారు. జంతువులను దత్తత తీసుకుని, నిర్వహణ వ్యయాన్ని విరాళంగా ఇచ్చే సదుపాయాన్ని మరింతగా విస్తరించాలని పాలకమండలి తీర్మానించింది.

మీరాలం ట్యాంక్ నుంచి జూ పార్క్ లోకి వచ్చే నీటిని నియంత్రించటం, మిషన్ బగీరథ ద్వారా జంతువులకు తాగునీటి వసతిని సంబంధిత శాఖ అధికారులతో చర్చించాలని నిర్ణయించారు.

సమావేశంలో జూ పార్క్ డైరెక్టర్ వినయ్ కుమార్, ఓఎస్డీ శంకరణ్, జపాట్ పాలకమండలి సభ్యులు, వివిధ జూ పార్క్ లు, జాతీయ పార్కుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్