ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య తలెత్తిన తాజా ఘర్షణను నివారించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ప్రతినిధి హడి అమ్ర్ ఇజ్రాయెల్ లోని టెల్ అవివ్ నగరానికి చేరుకున్నారు. కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్- పాలస్తీనా, ఐక్య రాజ్య సమితి జరుపుతున్న చర్చల్లో హడి కూడా పాల్గొంటారు. ఐదు రోజులుగా రెండు దేశాలకు చెందిన భద్రతా బలగాల మధ్య భీకర పోరు సాగుతోంది.
తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని గాజాకు చెందిన ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ ను హెచ్చరించింది. ఆ తర్వాత తలెత్తిన ఉద్రిక్తతలు రాకెట్ దాడుల వరకూ వెళ్ళాయి.
ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం గాజాలో 133 మంది, ఇజ్రాయెల్ లో 8 మంది మరణించారు. గాజా నగరంలోని శరణార్ధ శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు శనివారం జరిపిన రాకెట్ దాడిలో మహిళలు, పిల్లలు కలిపి 8 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజా చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేసింది.