భారత్‌లో తయారైన ఐడ్రాప్స్ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనుమానిస్తున్నది.
చెన్నైకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేసిన ఇజ్రికేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ వల్ల ముగ్గురు మరణించారని, ఎనిమిది మంది చూపు కోల్పోయారని, పదుల సంఖ్యలో ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని సీడీసీ భావిస్తున్నది. సూడోమోనాస్ ఎరుగినోసా అనే బ్యాక్టీరియా ఈ ఐడ్రాప్స్ ద్వారా సోకిందని, ఈ బ్యాక్టీరియా రక్తం, ఊపిరితిత్తులు, గాయాలలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందని అనుమానిస్తున్నది. ఈ ఐడ్రాప్స్ వాడి కంటి ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సీడీసీ సూచించింది.