Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రజలకు ప్రతిపక్షం

ప్రజలకు ప్రతిపక్షం

విలేఖరి:-
సార్! ఏట్లో కట్టిన మీ మెడికల్ కాలేజీని ఈరోజు సూర్యుడు నిద్ర లేవకముందే మునిసిపాలిటీ బుల్డోజర్లు, క్రేన్లు, జె సీ బీ లు, డ్రిల్లర్లు, ట్రాక్టర్లు వచ్చి ఎందుకు కూల్చేస్తున్నాయి?

నాయకుడు:-
అదే తమ్మీ! నాకూ అర్థం కావడం లేదు. నలభై ఏళ్ల కిందట ఖాళీగా ఉంటే…నేనక్కడ కొత్తిమీర పండించి…ఇల్లిల్లూ తిరిగి…కొత్తిమీర కట్టలు అమ్మి…పైసా పైసా కూడబెట్టి…ఆ నలభై ఎకరాలు కొన్నాను. ఇరవై ఎకరాల్లో ఇల్లు కొట్టుకున్నాను. మిగతా ఇరవై ఎకరాలు కూతురికి గిఫ్ట్ ఇస్తే…అల్లుడు మెడికల్ కాలేజీ కట్టుకున్నాడు. ఇందులో ఇల్లీగల్ ఏమీ లేదు.

వి:-
ఏట్లో భూములు మీకు అమ్మిందెవరు? కొన్నదెప్పుడు? రిజిస్ట్రేషన్ చేసిందెవరు? అది లీగల్ ఎలా అవుతుంది?

నా:-
నాకు నేనే అమ్ముకున్నాను. నాకు నేనే కొనుక్కున్నాను. ఇదిగో డాక్యుమెంట్ జెరాక్స్. దీని మీద మా లీగల్ టీముతో మాట్లాడుతున్నాను. నాకు న్యాయవ్యవస్థ మీద పూర్తీ నమ్మకముంది. నలభై ఏళ్లుగా ఆ నలభై ఎకరాలు మావి అని ఎవరూ రాకపోవడమే నా చిత్తశుద్ధికి నిదర్శనం. పైగా నేనందులో నాలుగు ఫ్లోర్లు కట్టి నలుగురికీ చదువు చెప్పే పవిత్ర విద్యా యజ్ఞం చేస్తున్నాను.

వి:-
ఉచితంగా చదువు చెబుతున్నారా?

నా:-
గుండాయన చెప్పిండు కదా!
చదువు ఎవరికీ ఊరికే రాదు. డబ్బులు చెట్లకు కాయదు.

వి:-
నిజమే సార్. డబ్బు ఏట్లో కాలేజీ గోడలకే కాస్తోంది.

నా:-
తమ్మీ! డబుల్ మీనింగ్ వద్దు. నాదంతా కుల్లం కుల్లా. బరాబర్ బాతాఖానీ. ఎవరికీ పనికిరాని భూమిలో నేను బంగారు పండిస్తున్నాను. నాకు భారతరత్న ఇవ్వాల్సింది పోయి…నా కాలేజీని పునాదులతో పాటు తవ్వేస్తారా?

వి:-
ఈ కాలేజీ బిల్డింగ్ ఇల్లీగల్ అని చుట్టూ ఉన్న జనం పాతికేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నారు మరి!

నా:-
చూసినవా! పాతికేళ్లుగా ఆ ఫిర్యాదులో పసలేదనే అధికారులు వచ్చి…మా కాలేజీలో టీ తాగి…సేద తీరి వెళుతున్నారు.

వి:-
పాతికేళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి…మీ ఇల్లీగల్ కాలేజీని కాపాడుకున్నట్లు చెబుతున్నారు!

నా:-
ఏమి జెప్పినవ్ తమ్మీ! భలే గుర్తు చేసినవ్. అందుకే నాకు జర్నలిస్టులంటే చచ్చేంత ఇష్టం. ఇప్పుడే నా అల్లుడిని తోడుకొని పోయి…అధికార పార్టీలో లక్ష మందితో చేరిపోతా. ఒక ఫుల్ పేజీ యాడ్ యేసుకో పో…మీ పేపర్లో.

ఏయ్ ఎవర్రా అక్కడ?
ఈ ఇయర్ కాలేజీ అడ్మిషన్లు హోల్డ్ లో పెట్టినట్లు తయారు చేసిన ఆ యాడ్ ఆపుండ్రి. అవసరం లేదు. కూల్చిన గోడల పక్కనే ఫీజు కౌంటర్ కోసం టెంపోరరీ షెడ్ వేసి గల్లా పెట్టె పెట్టండి.

తరువాతి రోజు దృశ్యాలు:-
నాయకుడు కుటుంబ సమేతంగా అధికార పార్టీలో చేరిన వార్తలు. ఊరంతా అవే హోర్డింగులు.

“కూట్లో రాయి ఏరలేనోడు…
ఏట్లో రాయి ఏరతాడంట”
అన్న సామెతను  ఎండిన ఏటి చెవికి ఎవరో వినిపించబోయారు- ఓదార్పుగా. ఎండిన ఏటికి సామెతలు వినే నైతిక హక్కు లేదన్న ఎరుకవల్ల ఏరు తన చెవులను తానే మూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్