Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశ్వాసించే నరసింహుడు .. తలనిండుగా నీళ్లతో శివుడు

శ్వాసించే నరసింహుడు .. తలనిండుగా నీళ్లతో శివుడు

Vadapalli Agasteswara Swamy Temple : 

(వాడపల్లి క్షేత్ర మహిమ)

లోక కల్యాణం కోసం నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడి నరసింహస్వామి ‘శ్వాస’ తీసుకుంటూ ఉంటాడు. స్వామి శ్వాసకు అనుగుణంగా దీపారాధన రెపరెపలాడుతూ ఉంటుంది. ఇక ఇక్కడికి అత్యంత సమీపంలోనే ప్రాచీనకాలం నాటి శివాలయం ఉంది.

ఈ ఆలయంలో శివలింగం తల భాగంలో నీరు ఊరుతూ ఉంటుంది. ఎంత నీరు తీస్తే అంతే నీరు తిరిగి ఊరుతూ ఉంటుంది. శివలింగం తల భాగాన్ని దాటి నీరు పొంగిపోవడంగానీ .. ఇంకిపోవడం గాని ఇంతవరకూ జరగలేదని అర్చకులు చెబుతూ ఉంటారు.

ముచికుందా (మూసీ) నది ఒడ్డున లక్ష్మీనరసింహుడు .. కృష్ణానది తీరంలో మీనాక్షీ సమేత అగస్త్యేశ్వరుడు కొలువైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలోను ఉంటుంది. వేలయేళ్లనాటి ఆధ్యాత్మిక సంపదగా.. వందల సంవత్సరాల చరిత్రకు నిదర్శనంగా కనిపించే ఆ హరిహర క్షేత్రమే ‘వాడపల్లి’. నల్గొండ జిల్లా.. దామరచర్ల మండలం.. మిర్యాలగూడెం సమీపంలో.. గుంటూరుకు వెళ్లే మార్గంలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది.తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటిగా.. అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతోంది.

లక్ష్మీనరసింహుడ.. మీనాక్షి సమేత అగస్త్యేశ్వరుడు ఇష్టపడి మరీ ఇక్కడ కొలువైనట్టుగా స్ధలపురాణం చెబుతోంది. హరిహరులు ఇద్దరూ ఆవిర్భవించడానికి అగస్త్య మహర్షి కారకులు కావడం విశేషం. అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి, లక్ష్మీనరసింహుడు.. మీనాక్షి సమేత పరమశివుడు ప్రత్యక్షమయ్యారట. లోక కల్యాణం కోసం భువిపై ఆవిర్భవించమని ఆ మహర్షి కోరడంతో, ఇద్దరు స్వాములు శిలా రూపాలుగా మారిపోయారట. తమ శిలారూపాలను ఒక ‘కావడి’లో పెట్టుకుని బయల్దేరమనీ, ఆకాశవాణి పలికిన చోటున తాము ఆవిర్భవిస్తామని అన్నారట.

అలా ‘కావడి’లో శివకేశవులను పెట్టుకుని నడక మొదలుపెట్టిన అగస్త్యుడు, ప్రస్తుతం ‘వాడపల్లి’గా పిలవబడుతున్న ఈ ప్రదేశం దగ్గరికి రాగానే, ఆ శిలారూపాలను అక్కడ దించమని ఆకాశవాణి పలికిందట. అగస్త్యుడు ‘కావడి’ దింపాడమే ఆలస్యం, ముచికుందా నది ఒడ్డున లక్ష్మీ నరసింహుడు.. కృష్ణానదీ తీరంలో శివుడు కొలువుదీరారుట. అప్పటి నుంచి అగస్త్యుడే స్వామివార్లకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తరువాత కాలగర్భంలో కలిసిపోయిన ఈ శిలారూపాలు, వేలయేళ్ల తరువాత రెడ్డిరాజులు పాలనలో వెలుగు చూశాయి.

అనవేమారెడ్డి – భీమారెడ్డి అనేవారు లక్ష్మీనరసింహస్వామికీ.. మీనాక్షి సమేత అగస్త్యేశ్వరుడికి ఆలయాలు నిర్మించి, నిత్య దీపాధూప నైవేద్యాలు జరిగేలా చేశారు. ఇప్పుడు మనం చూసే ఆలయాలు వాళ్లు నిర్మించినవే. అందుకు సంబంధించిన శాసనాలు మనకు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూనే ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి మూర్తి  చాలా భారీగా ఉంటుంది.స్వామి నాసికకి సమాంతరంగా ఒక దీపం.. కాస్త పై భాగంలో ఒక దీపం వెలిగించి ఉంచుతారు. పై భాగంలోని దీపం నిశ్చలంగా ఉంటుంది .. నాసికకి సమాంతరంగా ఉన్న దీపం, స్వామి శ్వాస తీసుకుని వదులుతున్నట్టుగా రెపరెపలాడుతూ ఉంటుంది. భక్తులు ప్రత్యక్షంగా ఈ చిత్రాన్ని చూడవచ్చు.

ఇక అక్కడికి కొద్ది దూరంలోనే ‘మీనాక్షి అగస్త్యేశ్వరుడు’ కొలువైన ఆలయం దర్శనమిస్తుంది. స్వామి శివలింగం తలభాగంలో నీరు ఊరుతూ ఉంటుంది. శివలింగం పైభాగాన్ని రెండు చేతుల వ్రేళ్లతో బలంగా పైకి పెకిలించినట్టుగా వ్రేళ్ల గుర్తులు కనిపిస్తాయి. చేతుల వ్రేళ్లు జొప్పించడం వలన ఏర్పడిన రంధ్రాలలోనే నీరు ఊరుతుంటుంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన కథనం ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిలా ఉండేదట. అప్పుడు ఒక పావురాన్ని తరుముతూ ఒక వేటగాడు ఈ శివలింగం దగ్గరికి వస్తాడు.

శివలింగం వెనక చేరిన పావురాన్ని ఆ వేటగాడు పట్టుకోబోగా శివుడు ప్రత్యక్షమై, తనని శరణు వేడిన పావురాన్ని వదిలేయమని చెబుతాడు. తన భార్యా బిడ్డలు ఆకలితో ఉన్నారనీ, వాళ్ల మాటేమిటని వేటగాడు అంటాడు. అయితే పావురంతో సమానమైన మాంసం తన తల నుంచి తీసుకోమని చెబుతాడు శివుడు. అంతే ఆ వేటగాడు తన రెండు చేతుల వ్రేళ్లను శివుడి తలలో జొప్పించి తల మాంసం తీసుకుంటాడు. అప్పుడు శివుడు పడుతున్న బాధను చూడలేక పాతాళం నుంచి పరిగెత్తుకు వచ్చిన గంగ, శివలింగం క్రింది భాగం నుంచి శిరస్సుభాగంలోకి ప్రవేశించి ఉపశమనాన్ని కలిగించిందని అంటారు.

ఒకసారి ఆదిశంకరులవారు తన శిష్యబృందంతో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించారు. శివలింగం తలభాగంలోని రంధ్రాలలో నీరు ఊరుతుండటం చూసి, ఈ నీరు ఎంత లోతు నుంచి వస్తున్నది తెలుసుకోవాలనే ఉద్దేశంతో, చిన్నపాటి బంగారు ‘ఉద్ధరిణి’కి దారం కట్టి, ఒక రంధ్రంలో నుంచి లోపలికి వదిలారట. ఎంత దారం వదిలినా అలా ఆ ‘ఉద్ధరిణి’ లోపలికి  వెళుతూనే ఉందట. దాంతో అది పరమేశ్వరుడి లీలవిశేషంగా భావించిన ఆదిశంకరులవారు తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట. దారాన్ని పూర్తిగా బయటికి లాగివేసిన తరువాత అక్కడక్కడ దానికి రక్తపు మరకలు అంటుకుని  ఉండటం చూసి ఆయన చాలా వేదన చెందారట. భగవంతుడిని బాధించినందుకు శాంతిహోమాలు నిర్వహించారు. వేరెవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆయన వేయించిన శాసనాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఇలా అనేక విశేషాల మాలికగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. లక్ష్మీనరసింహుడికి హనుమంతుడు క్షేత్ర పాలకుడు కాగా, శివయ్యకి క్షేత్ర పాలకుడిగా వీరభద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు. అందువలన ఇటు విష్ణు సంబంధమైన.. అటు శివ సంబంధమైన పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది.

కార్తీకమాసంలో.. శివరాత్రి పర్వదినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక కృష్ణా పుష్కరాల సమయంలో లక్షలాదిమంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలను ఆచరిస్తారు. శివకేశవుల దర్శనంతో తరిస్తారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజెల్లే ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడవలసిందే

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్