Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవందే భారత్ అనుభవం

వందే భారత్ అనుభవం

One-Day Bharat:  ఒకరోజు హైదరాబాద్ నుండి విజయవాడ; మరుసటిరోజు విజయవాడ నుండి విశాఖకు వందే భారత్ రైలెక్కాను. బెర్త్ లు ఉండని అన్నీ చైర్ కార్ బోగీలే. ఎగ్జిక్యూటివ్ , మామూలు చెయిర్ కార్ రెండు రకాల బోగీలు. బయట రైలు రంగు, రూపం వైవిధ్యంగానే ఉంది. లోపల ఎగ్జిక్యూటివ్ లో వసతులు పెంచారు. విమానంలోలా కూర్చోగానే నీళ్ల బాటిల్, న్యూస్ పేపర్ ఇచ్చారు. సీటును కిటికీ అద్దం వైపు, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరితే…నాలుగింటికి ఒక పెద్ద ట్రేలో తిను బండారాలు పెట్టారు. అందులో-
1. రాగి లడ్డు
2. సమోసా
3. సాండ్ విచ్
4. చిక్కి
5. మిక్చర్
6. కొబ్బరి నీళ్లు
7. ఇన్స్టెంట్ మసాలా చాయ్ పొడి

ఉన్నాయి. దేశ పౌరుల్లో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్న విషయాన్ని వందే భారత్ చాలా తీవ్రంగా పరిగణించినట్లు ఉంది. రాగి లడ్డు తిని, మసాలా చాయ్ తాగి మిగతావి పడేయకుండా బ్యాగులో పెట్టుకుని దిగినతరువాత మా ఆఫీసులో ఇచ్చాను.

సగటున 120- 130 కిలో మీటర్ల వేగం, తక్కువ స్టాపులు కాబట్టి సరిగ్గా నాలుగు గంటల ప్రయాణంతో విజయవాడ వచ్చింది. మరుసటి రోజు రాత్రి ఏడు గంటలకు విజయవాడలో మళ్లీ వందే భారత్ అనుకుంటూ అదే రైలు ఎక్కి రాత్రి పదకొండున్నరకు విశాఖలో దిగాను.

వందే భారత్ రైళ్ల మీద దేశ ప్రజల్లో ఏదో ఆసక్తి ఉన్నట్లుంది. లేక కొత్త ఒక వింత- పాత ఒక రోత కావచ్చు. ప్లాట్ ఫార్మ్ మీద కదిలే రైలుతో సెల్ఫీ ఫోటో, వీడియోలు తెగ తీసుకుంటున్నారు. లోపల ప్రయాణికులు కూడా ఉక్కిరి బిక్కిరి అయి బంధువులకు వీడియో కాల్ చేసి చంద్ర మండలం మీద తొలిసారి అడుగు పెట్టినట్లు ఆనందంగా చూపుతున్నారు.

ఈలోపు నా సీటు పక్కన ఒక సాయుధ పోలీసు వచ్చి కూర్చున్నాడు. ఖాకీ అంటేనే భయం. అలాంటిది అతడి బొడ్లో రివాల్వర్ నా వైపే చూస్తుండడంతో మరీ భయం. వెంటనే ఈమధ్య చదివిన వార్తలు గుర్తొచ్చాయి. కొందరు ఆకతాయులు వందే భారత్ మీద రాళ్లు రువ్వుతున్నారు. వేగంగా వెళ్లే ఆ రైలు అద్దాల మీద రాయి పడగానే కిటికీలు పగులుతున్నాయి. రైలుకు రక్షణగా వచ్చారా? అని అడిగాను. అవునన్నాడు. అయిదుగురు సాయుధులు కాసేపు కాసేపు ఒక్కో బోగీలో కూర్చుంటారట. ఈమధ్య ఖమ్మంలో వందే భారత్ మీద రాళ్లు రువ్విన ఇద్దరిని పట్టుకున్నారట. మీరు లోపల బోగీలో ఉంటే…వారు బయట రాళ్లు రువ్వితే ఎలా పట్టుకోగలిగారు? రైలు ఆగే లోపు వాళ్లు నాలుగు ఊళ్లు దాటి ఉంటారు కదా? అని నా మేధోశక్తినంతా రంగరించి ప్రశ్నించా. కింద మా పోలీసులుండరా? మా దగ్గర వాకీ టాకీలు, ఫోన్లు ఉండవా? అని ఎలా పట్టుకున్నారో వివరించాడు. ఇక జీవితంలో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, పాస్ పోర్ట్ రాదని…రైల్వే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ పోయాడు. కదిలే రైల్లో కాలం కదలక బోర్ కొట్టకుండా ఆసక్తిగా విన్నాను.

హైదరాబాద్- విజయవాడకు దాదాపు రెండు వేల రూపాయలు; విజయవాడ- విశాఖపట్నానికి 2,200 రూపాయలు టికెట్టు ధర. వచ్చేప్పుడు విశాఖ- హైదరాబాద్ విమానం టికెట్టు 3,800. వందే భారత్ లో అయితే బహుశా 3,120 ఉన్నట్లుంది. కాస్త అటు ఇటుగా విమానం ధర.

దాంతో ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ ధర తగ్గకపోతే… నెమ్మదిగా విమానమే చవక కదా అని వందే భారత్ వైపు చూడరు అని కొందరు ప్రయాణికులు; నాలుగు రోజులయితే అలవాటు అయిపోతుంది…కొన్ని వసతులు పెంచి…పేర్లు మార్చి ఇలా రేట్లు పెంచడం రైల్వేకు మామూలే అని మరి కొందరు ప్రయాణికులు టీ వీ డిబేట్లలోలా ఆగకుండా వాదించుకుంటున్నారు.

Vande Bharat Journey

“జెర్మనీలో ఆర్డర్ ఇస్తే రేట్ ఎక్కువ కోట్ చేశారు. దాంతో మేక్ ఇన్ ఇండియా కింద మన రైల్వేనే వందే భారత్ బోగీలను తయారు చేసింది. త్వరలో బెర్త్ లున్న బోగీలు కూడా వస్తాయి. స్పీడ్ 200 కిలో మీటర్లకు వీలుగా ట్రాక్ లను కూడా పటిష్ఠం చేస్తారు” అని ఒక రైల్వే అధికారి అనధికారికంగా చెప్పారు.

కొస విరుపు:-
వందే భారత్ రైల్లో ఎన్నో మంచి విషయాలు ఉంటే ఉండవచ్చుగాక. ప్లాట్ ఫార్మ్ మీద, లోపల రైల్లో అనౌన్స్ మెంట్ ప్రకటనల్లో తెలుగు భాషకు పట్టిన దుర్గతితో ఆ మంచి విషయాలన్నీ చెవిమరుగయ్యాయి. “పదో నంబరు ప్లాట్ ఫార్మ్ పైకి వచ్చి ఉన్నది”
(పదో నంబరు ప్లాట్ ఫార్మ్ పై ఉంది అంటే…వచ్చి ఉన్నట్లు కాదని…వచ్చి…ఉన్నది అని వ్యాకరణ సూత్రాలను తు చ తప్పకుండా పాటిస్తున్నారేమో!)
“బయలుదేరుటకు సిద్ధముగానున్నది”
(మరి కాసేపట్లో బయలుదేరుతుంది అంటే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదేమో!)
“తలుపులు ఆటోమాటిగ్గా మూసుకొనును”
(Doors will be closed automatically. తలుపులు ఆటోమేటిగ్గా మూత పడతాయి; తలుపులు వాటంతట అవే మూసుకుంటాయి అనకూడదేమో!)
చెబుతున్నది యంత్రం కాబట్టి అది అక్షరాలా యాంత్రిక భాషే.

 Vande Bharat Journey

తెలుగు మాతృ భాష అయిన ఎందరో తెలుగును యాంత్రికంగా మాట్లాడుతున్నప్పుడు…
ప్రాణం లేని ఒక రైలు యంత్రం యాంత్రిక భాషలో మాట్లాడ్డం దోషమే కాదు!
అది దాని సహజ గుణం.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్