Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమహిమాన్విత క్షేత్రం .. సింహాచలం (చందనోత్సవ ప్రత్యేకం)

మహిమాన్విత క్షేత్రం .. సింహాచలం (చందనోత్సవ ప్రత్యేకం)

సింహాచలం..శ్రీఆదివరాహ నారసింహస్వామి ఆవిర్భవించిన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం.. అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే మహిమాన్విత తీర్థం. విశాఖ జిల్లాలోని ఈ ప్రాచీన క్షేత్రం ఎత్తయిన కొండల మధ్యలో సేదదీరుతున్నట్టుగా..పచ్చని ప్రకృతి ఒడిలో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తుంది.

ఆ కొండకోనలు ఓంకారాన్ని జపిస్తున్నట్టుగా..మౌన ముద్రలో స్వామివారి నామన్ని స్మరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇంతటి దివ్యమైన క్షేత్రాన్ని ఇంతవరకూ చూడలేకపోయామే అనే ఆవేదన మదిలో మెదులుతుంది.

సాధారణంగా కొన్ని క్షేత్రాల్లో ఆదివరాహస్వామి అర్చామూర్తిగా ఉంటే, మరికొన్ని క్షేత్రాల్లో నరసింహస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఈ రెండు మూర్తుల కలయికగా స్వామివారు ఆవిర్భవించిన ఏకైక క్షేత్రంగా .. అరుదైన తీర్థంగా ‘సింహాచలం’ వెలుగొందుతోంది.

ఎత్తయిన రాజగోపురం .. పొడవైన ప్రాకారాలు .. అద్భుతమైన శిల్ప సౌందర్యన్ని ఆవిష్కరించే మంటపాలు, పవిత్రమైన తీర్థాలు ఈ క్షేత్ర వైభవానికి అద్దంపడుతూ ఉంటాయి. ఈ క్షేత్రం వందల సంవత్సరాలతోనో..వేల సంవత్సరాలతోనో కాదు, యుగయుగాల చరిత్రతో ముడిపడి ఉండటం విశేషం.

శ్రీమహావిష్ణువు..శ్రీఆదివరాహ నరసింహస్వామిగా ఆవిర్భవించడం వెనుక ఒక పురాణ పరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. కృతయుగంలో ప్రహ్లాదుడితో హరినామస్మరణ మాన్పించడానికి హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు..అనేక రకాలుగా వేధిస్తాడు..హింసిస్తాడు.

అయినా ప్రహ్లాదుడు తన వైఖరి మార్చుకోడు. శ్రీహరి సర్వాంతర్యామియనీ..ఆయన లేని చోటు లేదని ప్రహ్లాదుడు అంటాడు. అయితే ఈ స్థంభంలో ఉన్నాడా? అంటూ  హిరణ్య కశిపుడు అడుగుతాడు. సందేహమే లేదని ప్రహ్లాదుడు అనగానే, తన ‘గద’తో ఆ స్థంభాన్ని పగలగొడతాడు.

హిరణ్యకశిపుడికి గల వరాన్ని గురించి తెలిసిన శ్రీమహావిష్ణువు, నరుడు.. మృగము కలిసిన నరసింహస్వామిగా ఆ స్థంభం నుంచి వచ్చి ఆయనను సంహరిస్తాడు.

విష్ణుమూర్తి ధరించిన మత్స్యావతారం.. కూర్మావతారం.. వరాహావతారం.. రామావతరం.. కృష్ణావతారాలను పరిశీలిస్తే, ముందుగా ఒక వ్యూహ రచన చేసుకుని స్వామి ఆవిర్భవించాడనే విషయం అర్థమవుతుంది. అలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, తన భక్తుడిని రక్షించడం కోసం సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించినదిగా నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది.

హిరణ్యకశిపుడిని అంతమొందించిన అనంతరం కూడా స్వామి ఆగ్రహం తగ్గలేదట. ఆ మహోగ్రమైన రూపంతో భయంకరమైన గర్జనలు చేస్తూనే అక్కడి నుంచి బయల్దేరిన స్వామి, నేటి ‘సింహగిరి’పైకి చేరుకున్నాడట. స్వామిని అనుసరిస్తూ ప్రహ్లాదుడు.. దేవతలు.. మహర్షులు అంతా కూడా అక్కడికి చేరుకుంటారు. స్వామిని శాంతింపజేయడానికి చందనంతో అభిషేకం చేయమని ‘భృగు మహర్షి’ చెప్పడంతో, ప్రహ్లాదుడు అలాగే చేస్తాడు. అప్పుడు నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గుతుంది. తన పట్ల ప్రహ్లాదుడి భక్తికి మెచ్చిన స్వామి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు.

నరసింహస్వామి అవతార దర్శనం వలన తన జన్మ ధన్యమైనదనీ, అయితే హిరణ్యాక్షుడి సంహారం సమయంలో స్వామి ధరించిన ‘ఆదివరాహావతారం’ చూడాలని ఉందని కోరతాడు. దాంతో స్వామి ఆదివరాహమూర్తిగా ప్రహ్లాదుడికి దర్శనమిస్తాడు.

ఈ రెండు అవతారలతో కలిసి అక్కడ ఆవిర్భవించవలసిందిగా ప్రహ్లాదుడు కోరడంతో స్వామి సంతోషంగా అంగీకరిస్తాడు. అలా స్వామి ఇక్కడ వరాహ వదనం..మానవ దేహం..సింహం తోకతో ఆవిర్భవించి, శ్రీ ఆదివరాహ నరసింహస్వామిగా తొలిసారిగా ప్రహ్లాదుడిచే పూజాభిషేకాలు అందుకున్నాడు.

ఆ తరువాత త్రేతాయుగంలో చంద్రవంశ చక్రవర్తి ‘పురూరవుడు’.. ఊర్వశితో కలిసి పుష్పక విమానంలో ఈ కొండల మీదుగా వెళుతూ ఉండగా, స్వామి వెలసిన కొండ సమీపానికి రాగానే పుష్పక విమానం ఆగిపోతుంది. దాంతో వాళ్లిద్దరూ అక్కడ దిగుతారు. తనకి గల శక్తితో ‘సింహగిరి’ ప్రత్యేకతను గురించి పురూరవుడితో ఊర్వశి చెబుతుంది. అదే సమయంలో ఒక తెల్లని వరాహం కనిపించడంతో దానిని అనుసరిస్తూ వెళతారు. అది కొండపై ఒక పుట్ట దగ్గరికి వెళ్లి మాయమవుతుంది.

అప్పుడు ఆ పుట్టలోని శ్రీఆదివారాహ నరసింహస్వామి గురించి ఆకాశవాణి పలుకుతుంది. ఆ మూర్తిని అదే దిక్కులో ప్రతిష్ఠించి .. ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు జరిగేలా చూడమని ఆదేశిస్తుంది. పుట్టలోని స్వామివారు వెలుగు చూసింది ‘వైశాఖ శుద్ధ తదియ’ (అక్షయ తృతీయ) రోజున కావడం వలన ఆ రోజున మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుందనీ, మిగతా రోజులలో స్వామి 12 మణుగుల చందన పూతతో కప్పబడి ఉండాలని చెబుతుంది. అప్పటి నుంచి పురూరవుడు అలాగే చేస్తూ వచ్చాడట.

చందనం అద్దినప్పుడు స్వామి లింగాకారంలో దర్శనం ఇవ్వడం .. చందనం ఒలిచిన తరువాత వరాహావదనం .. మానవ శరీరం … సింహం తోకతో ఒక రకమైన సొగసుతో నిలబడిన మూర్తి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక స్వామి రూపం వామన మూర్తిని గుర్తుకు చేస్తూ కుదురుగా కనిపించడం మరో విశేషం. ద్వాపర యుగంలో ఎంతోమంది మహర్షులు స్వామి సేవలో తరించారు. కలియుగంలో ఎంతోమంది రాజులు స్వామి సేవలో పాలుపంచుకున్నారు. ఆపదలు తొలగించే స్వామిని వాళ్లంతా ఆత్మీయంగా ‘అప్పన్న’ అనే పిలిచుకున్నారు.. కొలుచుకున్నారు.

ఒకసారి జైత్రయాత్రలు పూర్తిచేసుకుని వస్తున్న శ్రీకృష్ష్ణదేవరాయలవారు ఈ క్షేత్రం మీదుగా వెళుతూ ఇక్కడ ఆగారట. స్వామివారి లీలావిశేషాలను గురించి మహర్షుల ద్వారా తెలుకున్న రాయలవారు,  క్షేత్ర వైభవానికి తనవంతు సహాయ సహకారాలను అందించాడట. రాయలవారు ఈ క్షేత్రాన్ని దర్శించారనడానికి గుర్తుగా ఇక్కడ ఆయన వేయించిన విజయస్థూపం కూడా ఉంది. ఎంతోమంది రాజులు స్వామివారి దర్శనం చేసుకుని, అనేక విలువైన కానుకలను స్వామివారికి సమర్పించుకుని సంతోషించారు. అందుకు ఆధారాలుగా ఇక్కడ అనేక శిలాశాసనాలు కనిపిస్తూ ఉంటాయి.

వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున ఉదయాన్నే స్వామికి సుప్రభాత సేవను నిర్వహించి, ప్రత్యేక పూజా  కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఆ తరువాత వేద మంత్రాల మధ్య స్వామిపై గల చందనాన్ని ఒలుస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి, నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. అప్పటి నుంచి 12 గంటలపాటు స్వామివారి ‘నిజరూప దర్శనం’ లభిస్తుంది. ఆ తరువాత ‘గంగధార’ తీర్థం నుంచి తీసుకొచ్చిన వేయి ఎనిమిది కలశాలతో.. సుగంధ ద్రవ్యాలతో స్వామిని అభిషేకిస్తారు. పండ్లను.. చల్లని పానియాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత మళ్లీ చందనం అద్దే కార్యక్రమం మొదలవుతుంది.

అలా అక్షయ తృతీయ రోజున స్వామివారికి 120 కిలోల చందనం అద్దుతారు. ఆ తరువాత వైశాఖ పౌర్ణమి రోజున 120 కిలోలు.. జ్యేష్ఠ పౌర్ణమి రోజున 120 కిలోలు.. ఆషాఢ పౌర్ణమి రోజున 120 కిలోల చొప్పున మొత్తం 480 కేజీల చందనం స్వామివారిపై ఒక లేపనంలా పూయబడి ఉంటుంది. ప్రత్యేకంగా తయారుచేయించబడిన వస్త్రంతో లింగాకారంలోని స్వామిని అలంకరిస్తారు. వైశాఖ శుద్ధ తదియ మరుసటి రోజున.. అంతకుముందు స్వామి మూర్తి నుంచి ఒలిచిన చందనాన్ని భక్తులకు పంచుతారు. ఈ చందనాన్ని ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకోవడం వలన అనేక శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. స్వామివారితో పాటు ప్రత్యేకమైన ఆలయంలో ‘సింహవల్లి తాయారు’ పేరుతో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది.

ఈ క్షేత్రానికి ‘త్రిపురాంతకేశ్వరుడు’ క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. ఆయన పర్యవేక్షణలోనే అంతా నడుస్తూ ఉంటుంది. ఆ స్వామిని కూడా ఇక్కడి ప్రాంగణంలో గల ఆలయంలో దర్శించుకోవచ్చు. ఇక్కడి ‘కప్ప స్థంభం’ను ఆలింగనం చేసుకున్నవారి మనోభీష్టాలు నెరవేరతాయని చెబుతారు. కోరికలు నెరవేరిన వారు, స్వామివారికి కోడె దూడలను మొక్కుబడిగా చెల్లిస్తుంటారు. చైత్రమాసంలో జరిగే కల్యాణోత్వాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. స్వామివారిని .. అమ్మరిని నూతన దంపతులుగా దర్శించుకుని తరించిపోతారు. యుగయుగాల చరిత్ర కలిగిన ఇక్కడి స్వామిని స్మరిస్తే పుణ్యం .. ఈ దివ్య క్షేత్రాన్ని దర్శిస్తే ధన్యం.

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్