మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ ఆచి తూచి అడుగేస్తూ వెళుతున్నాడు. కథల ఎంపిక విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. అయితే ‘గద్దలకొండ గణేశ్’ తరువాత, కోవిడ్ తో కలుపుకుని చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ తరువాత ఆయన చేసిన ‘గని’ పరాజయం పాలైంది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, వరుణ్ తేజ్ ను చాలా నిరాశ పరిచింది. అదే సమయంలో ‘ఎఫ్ 3’ రాకపోతే ఆయనకి కాస్త ఇబ్బంది అయ్యేదే.
‘ఎఫ్ 3’ కూడా ఏదో ఫ్లోలో వెళ్లిపోయింది గానీ, ‘ఎఫ్ 2’ స్థాయిలో వినోదాన్ని పంచలేకపోయిందనే అభిప్రాయలు రిలీజ్ సమయంలోనే వ్యక్తమయ్యాయి. ఆ సినిమా తరువాత ఆయన పట్టాలెక్కించిన ప్రాజెక్టు ‘గాండీవధారి అర్జున’. భారీ బడ్జెట్ తో బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కెరియర్ పరంగా వరుణ్ తేజ్ కి ఇది 12వ సినిమా.
మొదటి నుంచి కూడా ఈ సినిమా షూటింగును విదేశాల్లోనే ఎక్కువగా జరుపుతూ వస్తున్నారు. రీసెంట్ గా యూకేలో ఒక భారీ షెడ్యూల్ షూటింగును పూర్తిచేశారు. వరుణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సీన్స్ ను ఇక్కడ షూట్ చేశారు. ఆ తరువాత మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి గాను. యూరప్ వెళుతున్నట్టుగా ఈ సినిమా టీమ్ చెప్పింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. తెలుగులో ఆమెకి ఇది రెండో సినిమా.