వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గాండీవధారి అర్జున’ ఆగస్టు 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాజర్ .. వినయ్ రాయ్ కీలకమైన పాత్రలను నాజర్ పోషించారు. అయితే థియేటర్ల నుంచి ఈ సినిమాకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ కరువైంది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘నెట్ ఫ్లిక్స్’ ద్వారా ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది.
ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు నెట్ ఫ్లిక్స్ వారు వెల్లడిస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కథ ప్రకారం ఈ సినిమా దాదాపు యూరప్ కంట్రీస్ లో నడుస్తుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ కథను పరుగులు తీయించారు. యాక్షన్ సీక్వెన్స్ లకు .. ఛేజింగులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. యాక్షన్ దృశ్యాల వరకూ ప్రవీణ్ సత్తారు మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎమోషనల్ గా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది.
దర్శకుడు యాక్షన్ సన్నివేశాలపై చూపించిన శ్రద్ధ, లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ పై పెట్టలేదనే కామెంట్స్ వినిపించాయి. పాటలు కూడా కథకు అదనపు బలాన్ని చేకూర్చలేకపోయాయి. ఇక అభినవ్ గౌతమ్ పాత్ర నుంచి ఆడియన్స్ కామెడీని ఆశించారు. కానీ ఆ పాత్ర నుంచి కూడా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందలేదు. వరుణ్ తేజ్ మంచి ఫిట్ నెస్ తో ఫైట్స్ ఒక రేంజ్ లో చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కథలో ప్రేక్షకులు ఆశించిన అంశాలు .. వాటిలోని పాళ్లు తగ్గడమే అందుకు కారణం. మరి ఓటీటీ ద్వారా ఈ సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ దక్కుతుందనేది చూడాలి.