శివరాజ్ కుమార్ కి కన్నడలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా మాస్ ఫాలోయింగును పెంచుకుంటూ వచ్చిన హీరో ఆయన. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ ఇండస్ట్రీలలోను ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. అందరితోనూ ఆయన చాలా సాన్నిహిత్యంతో ఉంటారు. అలాంటి ఆయన నుంచి 125వ సినిమాగా ‘వేద’ నిర్మితమైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. డిఫరెంట్ లుక్ తో ఆయన ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
క్రితం ఏడాది డిసెంబర్లో కన్నడలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, నిన్న రాత్రి హైదరాబాద్ ‘దసపల్లా’ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. బాలకృష్ణ చీఫ్ గెస్టుగా ఈ కార్యక్రమానికి వచ్చారు. శివరాజ్ కుమార్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ఆయన ఈ స్టేజ్ పై ప్రస్తావించారు. బలమైన సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ కష్టపడి ఆయన ఈ స్టేజ్ కి వచ్చారని అన్నారు.
శివరాజ్ కుమార్ కన్నడలో చేసిన ‘మఫ్టీ’ సినిమాలోని లుక్ ను ఆధారంగా చేసుకుని, ‘వీరసింహారెడ్డి’ లుక్ ను డిజైన్ చేయడం జరిగిందని చెప్పారు. నటీనటులు .. టెక్నీషియన్స్ పనితీరు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. మంచి కథాకథనాలు .. మాస్ యాక్షన్ .. ఎమోషన్స్ .. పాటలకి పాటలు .. మాటలకి మాటలు ఇలా అన్ని అంశాలు కుదిరిన సినిమా ఇది అని చెప్పారు. ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపాన్ని చూడొచ్చనీ, ఇక్కడ కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు.