బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ‘వీరసింహారెడ్డి‘, ఈ రోజున థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. అటు ‘అఖండ’ హిట్ తరువాత బాలయ్య .. ఇటు ‘క్రాక్’ హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేసిన సినిమా కావడంతో సహజంగానే ‘వీరసింహారెడ్డి’ పై అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా అంటే, అందుకుందనే చెప్పాలి.
కొన్ని కారణాల వలన ‘వీరసింహా రెడ్డి’ (సీనియర్ బాలయ్య) కొడుకు జై సింహారెడ్డి (జూనియర్ బాలయ్య) ‘ఇస్తాంబుల్’ లో పెరుగుతాడు. తల్లి మీనాక్షి తప్ప తండ్రిని గురించి అతనికి ఏమీ తెలియదు. మరికొన్నికారణాల వలన వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్), తన అన్నయ్యకి పగవాడు అయిన ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్)ని పెళ్లి చేసుకుంటుంది. తన కొడుకు జైసింహారెడ్డిని వీరసింహా రెడ్డికి దగ్గర చేయడానికి మీనాక్షి ట్రై చేస్తుంటే, తన భర్తతో కలిసి వీరసింహారెడ్డిని అంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకు గల కారణాలు ఏమిటి? చివరికి ఏమైందనేదే కథ.
బాలకృష్ణ సినిమా అంటే మాస్ యాక్షన్ ఉండాలి .. మాటల్లో దమ్ము ఉండాలి .. పాటల్లో పస ఉండాలి. ఇక డాన్సుల్లో మాస్ ఎనర్జీ ఉండాలి. అవన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. బాలయ్య సినిమాకి ఏమేం కావాలో అవన్నీ ఏర్చి కూర్చి వండి వడ్డించిన సినిమా ఇది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు, మాస్ బీట్లు .. సాయిమాధవ్ బుర్రా పవర్ ఫుల్ డైలాగ్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. ఫొటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. బాలకృష్ణ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ పాత్రలను మలచిన తీరు మంచి మార్కులను కొట్టేస్తుంది. తన సినిమాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ కొట్టడం ఖాయమనే ఒక సెంటిమెంట్ బాలయ్యకి ఉంది. ఈ సినిమా ఆ నమ్మకాన్ని మరింత బలపడేలా చేసిందనే చెప్పచ్చు.