వెంకటేశ్ కెరియర్ ను పరిశీలిస్తే మొదటి నుంచి కూడా ఆయన కొత్తదనానికి ప్రాధాన్యతను ఇవ్వడం కనిపిస్తుంది. ఇతర భాషలలోని హిట్ చిత్రాలను రీమేక్ చేస్తూ వెళ్లడం కూడా కనిపిస్తుంది. ఎటు చూసినా ఆయన కెరియర్ లో సక్సెస్ రేటు గట్టిగానే ఉంటుంది. ఇక వెంకటేశ్ బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి రావడం వలన, కథల విషయంలో ఆయనను అంత తొందరగా ఒప్పించడం కష్టమే. దాదాపు తనకి నమ్మకం కలిగిన దర్శకులకే ఆయన అవకాశాలు ఇస్తూ వెళుతుంటారు.
అలాంటి వెంకటేశ్ ఆ మధ్య తన నుంచి దృశ్యం 2 .. నారప్ప .. ఎఫ్ 3 వంటి సినిమాలను వదులుతూ వెళ్లారు. ఆ సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ వెళ్లడంతో ఆయన సక్సెస్ రేటు మరింతగా పెరుగుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన శైలేశ్ కొలనుకు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సైంధవ్’, వెంకీ అభిమానులను చాలా నిరాశపరిచింది. ఈ సినిమా కంటెంట్, 80s లో వచ్చిన అనువాద చిత్రాల తరహాలో ఉందనే విమర్శలు వచ్చాయి. ఇది వెంకటేశ్ కి 75వ సినిమా .. అందువలన వెంకీ కూడా కాస్త అసహనానికి లోనయ్యారనే టాక్ వచ్చింది.
నిజానికి ఈ సినిమా తరువాత నుంచి కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలిస్తూ .. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను చేస్తూ వెళ్లాలని వెంకీ నిర్ణయించుకున్నారట. అలా ఆయనకి కొంతమంది యువ దర్శకులు కథలు వినిపించడం, వాటిలో కొన్ని కథల పట్ల వెంకీ ఉత్సాహాన్ని చూపించడం జరిగిందట. కానీ ‘సైంధవ్’ రిజల్ట్ కారణంగా వెంకీ మనసు మార్చుకున్నాడని అంటున్నారు. కొత్తగా ట్రై చేయాలనే ఆలోచనను ప్రస్తుతం పక్కన పెట్టేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడితో చేస్తున్న ఈ సినిమా, వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.