Saturday, November 23, 2024
Homeసినిమారియల్ బాల 'సార్' (కె. రంగయ్య) ని అభినందించిన వెంకీ అట్లూరి

రియల్ బాల ‘సార్’ (కె. రంగయ్య) ని అభినందించిన వెంకీ అట్లూరి

ధనుష్‌ హీరోగా నటించిన ‘సార్‘ చిత్రం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇది గురువు గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం. పేద విద్యార్థుల చదువు కోసం బాల గంగాధర్ తిలక్ అనే ఓ గురువు సాగించిన పోరాటమే ఈ చిత్ర కధాంశం. ఈ చిత్రంలో విద్య గొప్పతనాన్ని తెలుపుతూ బాల గంగాధర్ తిలక్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. అయితే.. అలాంటి బాల గంగాధర్ తిలక్ నిజం జీవితంలోనూ ఉన్నారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ ఖేడలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు కేడర్ల రంగయ్య. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 60 లోపే. కానీ ఆయన కృషి ఆ సంఖ్యను 260 కి చేరేలా చేసింది.

తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి.. తన బాటలోనే ఆ గ్రామస్థులు నడిచేలా వారిలో స్ఫూర్తి నింపారు రంగయ్య. తన సొంత డబ్బుతో పాఠశాలను మరమ్మత్తులు చేయించడానికి పూనుకున్న ఆయనను చూసి గ్రామస్థులు ముందుకొచ్చి పాఠశాలకు కొత్త మెరుగులు దిద్దారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రంగయ్య. కేడర్ల రంగయ్య జీవితం సార్ చిత్రానికి స్ఫూర్తి కాదు. కానీ ఆయన జీవితం కూడా బాల గంగాధర్ తిలక్ కథ లాగే స్ఫూర్తిదాయంగా ఉంది. అదే కేడర్ల రంగయ్యను ‘సార్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా కలిసేలా చేసింది.

నిజజీవితంలో తాను చూసిన, విన్న సంఘటనల ఆధారంగా సార్ కథను, బాల గంగాధర్ తిలక్ పాత్రను తీర్చిదిద్దారు వెంకీ అట్లూరి. అయితే సినిమా విడుదలై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో.. తాను రాసుకున్న బాల గంగాధర్ తిలక్ పాత్రను పోలిన ఉపాధ్యాయుడు నిజంగానే ఉన్నారని తెలిసి వెంకీ అట్లూరి ఆశ్చర్యపోయారు. అంతకుమించి ఆనందపడ్డారు. కేడర్ల రంగయ్యని కలవాలనుకున్నారు. అనుకోవడమే కాదు హైదరాబాద్ లో కలిశారు కూడా. వెంకీ అట్లూరి, కేడర్ల రంగయ్య ఇద్దరూ కలిసి సార్ చిత్రం గురించి, సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. సార్ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల్లో తనని తాను చూసుకున్నట్లు ఉందని కేడర్ల రంగయ్య చెప్పడంతో వెంకీ అట్లూరి ఎంతగానో సంతోషించారు. అలాగే అతి చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ అవార్డు అందుకున్నారని తెలిసి కేడర్ల రంగయ్యను వెంకీ అట్లూరి ప్రత్యేకంగా అభినందించారు.

Also Read: భారతీరాజా మెచ్చిన ధనుష్ తాజా చిత్రం సార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్