Venkaiah Naidu condoled:
సుప్రసిద్ధ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. “ప్రముఖ నృత్య దర్శకుడు శ్రీ శివశంకర్ మాస్టర్ పరమపదించారని తెలిసి విచారించాను. భారతీయ నాట్య సంప్రదాయాలకు, చక్కని అభినయాన్ని జోడించి దాదాపు 10 భారతీయ భాషల్లోని వందలాది చిత్ర గీతాలకు వారు సమకూర్చిన నృత్యరీతులు అభినందనీయమైనవి” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.
కాగా, మాస్టర్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో జరగనున్నాయి. నిన్న జరిపిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ కావడంతో శివ శంకర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం మణికొండ పంచవటి కాలనీలోని అయన నివాసానికి తరలించారు. మాస్టర్ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
శివ శంకర్ మాస్టర్ మరణ వార్త తనను కలచి వేసిందన మెగా స్టార్ చిరంజీవి అన్నారు. తాను నటించిన ఖైదీ చిత్రానికి సలీం మాస్టర్ నృత్య దర్శకుడైనప్పటికీ అయన అసిస్టెంట్ గా వెనకుండి డ్యాన్స్ కంపోజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఇటీవలే ‘ఆచార్య’ సినిమా సెట్ లో ఆయన్ను కలుసుకున్నానని, అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.
శివ శంకర్ మాస్టర్ తో తనకు మంచి అనుబంధం ఉందని, అయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలను పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
శాస్త్రీయ నృత్యంలో మంచి పట్టున్న శివ శంకర్ మాస్టర్ సినిమా సంగీతంలో దాన్ని మేళవించి ప్రేక్షకులను మెప్పించారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు.
Also Read : శివ శంకర్ మాస్టర్ కన్నుమూత