Mini Review: కథ ఆరంభంలోనే ఒక మర్డర్ జరుగుతుంది .. ఆ మర్డర్ ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే ప్రశ్నలు ప్రేక్షకుల ముందు నిలబడతాయి. ఆ కేసును ఛేదించడానికి హీరో తప్ప మరో ఛాయిస్ ఉండదు. ఆయన రంగంలోకి దిగవలసిందే .. అసలైన నేరస్థుడిని కనిపెట్టి కలుగులో నుంచి బయటికి లాగవలసిందే. ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి నేపథ్యంతో వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ గా ‘హత్య’ కనిపిస్తుంది. విజయ్ ఆంటోని హీరోగా చేసిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది.
ఈ తరహా కథల్లో హంతకులేవరనేది తెలుసుకోవడానికి అవసరమైన ఆధారాలను సంపాదిస్తూ .. అతణ్ణి పట్టుకోవడానికి కొన్ని వ్యూహాలను పన్నుతూ హీరో ముందుకువెళ్లే తీరే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధానమైన అంశం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులంతా హీరోనే ఫాలో అవుతూ ఉంటారు. అందువలన ఆయన వేసే ప్రతి అడుగూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఆ సమయంలో హీరో జోరు తగ్గకూడదు .. అతను ఏ విషయాన్ని నాన్చకూడదు. అలాంటి ఇంట్రెస్టును క్రియేట్ చేయడంలో దర్శకుడు బాలాజీ కుమార్ కొంతవరకూ సక్సెస్ అయ్యాడు.
అయితే ఇక్కడ హీరో ఏం చేశాడు? అనే దాని కంటే కూడా ఎంత స్పీడ్ గా చేశాడు అనే దానిపైనే ఆడియన్స్ ఎక్కువ దృష్టి పెడతారు. వాళ్లు ఆశించిన స్థాయి స్పీడ్ లో కథనం ముందుకు వెళ్లకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. అలాగే విలన్ ట్రాక్ విషయంలో కాస్త అసంతృప్తి కలుగుతుంది. ఇక మనకి తెలియకుండానే మనలను కథలో కలిపేసేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఆ వైపు నుంచి ఓకే. ఫొటోగ్రఫీకి కూడా వంకబెట్టవలసిన పనిలేదు. విజయ్ ఆంటోని లుక్ .. ఆయన మేనరిజం .. ఆడియన్స్ గెస్ చేయని క్లైమాక్స్ ప్రధానమైన బలంగా అనిపిస్తాయి.