మాస్ ఇమేజ్ కావాలనుకున్న హీరోలు పూరితో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఎందుకంటే మాస్ ఆడియన్స్ కి ఏం కావాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆల్రెడీ మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్న విజయ్ దేవరకొండతో ఆయన సినిమా చేస్తే దానిపై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘లైగర్‘ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ‘ఫ్యాన్ డమ్ టూర్’ను నిర్వహిస్తూ, అందులో భాగంగా నిన్న వరంగల్ లో అభిమానుల మధ్య హడావిడి చేశారు.
ఈ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ .. “నేను ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కొంతవరకూ చూడగానే విజయ్ తో తప్పకుండా ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆయన యాక్టింగ్ లో నిజాయితీ కనిపించింది. బయట కూడా ఆయన అంతే నిజాయితీతో ఉండటం గమనించాను. విజయ్ లో నాకు నచ్చింది అదే. తాను తెరపై మాత్రమే హీరో కాదు .. రియల్ లైఫ్ లోను అంతే. నిర్మాతగా ఆయనకి ఇవ్వవలసినదాంట్లో రెండు కోట్లు పంపించాను. కానీ నేను అప్పుల్లో ఉన్నానని తెలిసి, ముందుగా ఆ అప్పును క్లియర్ చేయమని చెప్పి తిరిగి పంపంచేశాడు .. అదీ విజయ్ అంటే.
ఇక ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. తాను మంచి అందగత్తె మాత్రమే కాదు .. మంచి ఆర్టిస్ట్ కూడా. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇక రమ్యకృష్ణ రోల్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆమె పోషించిన మాస్ మదర్ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మైక్ టైసన్ ఈ సినిమాలో కనిపించడం విశేషం. ఆయనతో కలిసి పనిచేసినందుకు నేను .. విజయ్ కూడా చాలా గర్వపడుతున్నాము. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి” అని చెప్పుకొచ్చాడు.