Saturday, November 23, 2024
HomeTrending Newsఇదెక్కడి వాదన బాబూ: విజయసాయి ప్రశ్న

ఇదెక్కడి వాదన బాబూ: విజయసాయి ప్రశ్న

తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కార్యకర్తలుగా, వైఎస్సార్సీపీ వారు గుండాలుగా చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి  తప్పు బట్టారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై విరుచుకు పడుతున్న విజయసాయి… ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ, బాబు చేసిన ఆరోపణలపై తనదైన సాహిలిలో స్పందించారు.

“అసెంబ్లీలో విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పాలక, ప్రతిపక్షాల మధ్య గొడవలు జరిగాయి. టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటగా మూడు రోజలు పర్యటించి ఇక్కడ ఘర్షణలకు దోహదం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, బహుళపక్ష రాజకీయాల్లో వివిధ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ముఖ్యంగా ఇండియా వంటి వర్ధమాన ప్రజాతంత్ర దేశాల్లో– పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య అప్పుడప్పుడూ ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం సాధారణమని మన 70 ఏళ్ల అనుభవాలు చెబుతున్నాయి. ఒక రాష్ట్రంలో అధికారం కోసం రెండు ప్రధాన ప్రాంతీయపక్షాల మధ్య స్పర్ధ ఉన్నప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అది వాంఛనీయ పరిణామం కాదు. ఎక్కడైనా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు మామూలు వాతావరణం పునరుద్ధరించడానికి పాలకపక్షానికి, పాలనా యంత్రాంగానికి– ప్రధాన విపక్షం తోడ్పడాలి. రాజకీయ కొట్లాటల వల్ల సామాన్య కార్యకర్తలు, వాటితో సంబంధం లేని సాధారణ పౌరులు ఎక్కువ నష్టపోతారు. ఈ విషయాలన్నీ మాజీ సీఎం అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఆయనకున్న 44 ఏళ్ల రాజకీయ ‘పరిశ్రమ’ చాలు ఈ అంశాలన్నీ అర్ధం కావడానికి. అయితే, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు”

“ఆయన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వంపై వేస్తున్న నిందల్లో పరాకాష్ఠ ఏమంటే–ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూండాలను వదిలేసి, తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోందని చెప్పడం. పాలకపక్షం కార్యకర్తలు ‘గూండాలు’ అని. టీడీపీ వాళ్లు మాత్రమే కార్యకర్తలని చంద్రబాబు విలేఖరుల సమావేశంలో వర్ణించడం ఆయన వంకర చూపునకు నిదర్శనం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి ఐదేళ్లు, కుప్పం నుంచి 33 ఏళ్లుగా ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఈ నాయకుడు ఇలా మాట్లాడడం అన్యాయం. ఒక పార్టీ వర్కర్లు గూండాలుగా, సొంత పార్టీ వారు కార్యకర్తలుగా కనపడడం ఆయన కళ్లకు కమ్మిన పొరలకు సంకేతమనే అనుమానం వస్తోంది” అంటూ విజయసాయి మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్