Thursday, March 28, 2024
HomeTrending Newsరుణాలు ఈక్విటీగా మార్చండి: విజయసాయి

రుణాలు ఈక్విటీగా మార్చండి: విజయసాయి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత,  ఎంపి విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వ నిర్ణయమని, ఈ విధానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. నష్టాల్లో ఉన్నసంస్థలను లాభాల దిశగా నడిపించాలి కానీ ప్రైవేటీకరణ పరిష్కారం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నారని  వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటితో విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస రావు, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, బీసెట్టి వెంకట సత్యవతిలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కమిటి నేతలతో చర్చించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్న లోన్ ను ఈక్విటీగా మార్చి వడ్డీభారాన్ని తగ్గించాలని, ముడిసరుకు కోసం గనులను కేటాయించాలని సూచించారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయమై ఒత్తిడి తీసుకువస్తామని, కేంద్ర ఆర్ధిక శాఖ, ఉక్కు శాఖ మంత్రులను కలుస్తామని హామీ ఇచ్చారు. బిజెపియేతర పార్టీలను కూడా కలుస్తామన్నారు. జంతర్ మంతర్ వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి చేపట్టే ఆందోళనలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలే నెరవేర్చలేదని, ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ అమ్మాలని అనుకోవడం సరికాదని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు. విశాఖ నడిబొడ్డున ఉన్న ఈ ప్లాంట్ జాతి సంపద అని, ఇలాంటి వాటిని అమ్ముకుంటూ వెళ్తే ఇంకేమీ మిగలవని అభిప్రాయడ్డారు. వాళ్ళకు మెజార్టీ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో వారికి బలం లేదు కాబట్టి, ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అవంతి హెచ్చరించారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ అభిప్రాయ బేధాలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కలిసి రావాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్