Saturday, January 18, 2025
Homeసినిమాఅందం... అభినయం... విజయశాంతి వైవిధ్యం

అందం… అభినయం… విజయశాంతి వైవిధ్యం

Lady Superstar Vijayashanti Birthday Special : 

కథానాయిక అందంగా ఉండాలి .. నాజూకుగా ఉండాలి .. కంటిచూపుకే కందిపోయేలా ఉండాలి అని ప్రేక్షకులు భావిస్తారు. గ్లామర్ పరంగా వాళ్ల మనసులను దోచుకుంటే కెరియర్ పరంగా కొంతకాలం వరకూ వాళ్లకి ఎలాంటి ఢోకా ఉండదు. పాటల్లో గ్లామర్ ను ఒలకబోస్తూనే .. ఫైట్లు కూడా చేసేస్తానంటే మాత్రం ప్రేక్షకులు ఒప్పుకోరు. సున్నితంగా .. సుకుమారంగా కనిపించే కథానాయికలు విలన్ గ్యాంగ్ పై విరుచుకుపడటాన్ని వాళ్లు అంగీకరించరు. ఈ రెండు విషయాల్లో అభిమానులను మెప్పించడం చాలా కష్టం.

అలాంటి కష్టమైన మార్గంలో అవలీలగా అడుగుపెట్టిన కథానాయికగా విజయశాంతి కనిపిస్తారు. 80వ దశకంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో విజయశాంతి ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో .. అమాయకత్వంతో కూడిన అందంతో ఆమె తెరపై మెరిశారు. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం విజయశాంతి సొంతం. జయప్రద తరువాత చీరకట్టులో అంత అందంగా కనిపించే కథానాయికగా విజయశాంతి మార్కులు కొట్టేశారు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలుగా ఉన్న కృష్ణ .. శోభన్ బాబు సరసన మెప్పిస్తూనే, ఆ తరువాత తరం హీరోలైన చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ .. మోహన్ బాబు .. సుమన్ లతో కలిసి అలరించడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

‘కిలాడీ కృష్ణుడు’ సినిమాతో .. విజయనిర్మల దర్శకత్వంలో విజయశాంతి తెలుగు తెరకి పరిచయమయ్యారు. తెలుగు తెరపై విరిసిన తామరపువ్వులాంటి ఈ అమ్మాయిపై ఆరంభంలో ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు. హీరోలతో కలిసి సరదాగా ఆడిపాడటానికి మాత్రమే ఆమె బాగుంటుందని అంతా అనుకుంటున్న సమయంలో, ‘పడమటి సంధ్యారాగం’ .. ‘ప్రతిఘటన’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేశారు. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు.ఒక సినిమాలో మంచు ముక్కలా .. మరో సినిమాలో నిప్పుకణికలా కనిపిస్తూ ప్రేక్షకులను ఆమె ఆశ్చర్యపరిచారు. అందం .. అంతకుమించిన అభినయం తన సొంతం అంటూ అభినందనలు అందుకున్నారు.

‘ప్రతిఘటన’ సినిమా విజయశాంతి నటనలో కొత్త కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. కెరియర్ తొలినాళ్లలోనే ఆమె నటనకి కొలమానంగా నిలిచింది. కథా భారాన్ని ఆమె తన భుజాలపై వేసుకుని నడిపించగలదనే నమ్మకాన్ని కలిగించింది. నాయిక ప్రధానమైన సినిమాలను ఆమెతో చేయవచ్చుననే సంకేతాలను ఇండస్ట్రీలోకి తీసుకెళ్లింది. దాంతో ఒక వైపున గ్లామర్ పరమైన చలాకీ పాత్రలను .. మరో వైపున నటన ప్రధానమైన ధీర .. గంభీర .. రౌద్రపూరితమైన పాత్రలను చేస్తూ వెళ్లారు.

ఇక 90వ దశకంలో వచ్చిన ‘కర్తవ్యం’ .. విజయశాంతి కెరియర్ గ్రాఫ్ ను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. ఈ సినిమా నుంచి ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. అప్పటివరకూ కథానాయికలలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించినది ఒక్క శారద మాత్రమే. ఆ తరువాత ఆ స్థాయిలో ‘ఔరా!’ అనిపించింది విజయశాంతి మాత్రమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా తరువాత ఆమె స్టార్ హీరోల సరసన నాయికగా అలరిస్తూనే, నాయిక ప్రాధాన్యత గల ‘ఆశయం’ .. ‘ఒసేయ్ రాములమ్మా’ వంటి సినిమాలను చేస్తూ వెళ్లారు. 

విజయశాంతి కూడా ఇతర కథానాయికల నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. సుహాసిని .. రాధ .. భానుప్రియ ఆ సమయంలో బరిలో ఉన్నారు. ఈ ముగ్గరూ కూడా అందం .. అభినయం పుష్కలంగా ఉన్నవారే. అయినా వారి ధాటిని  తట్టుకుని విజయశాంతి నిలబడటానికీ .. నెంబర్ వన్ అనిపించుకోవడానికి కారణం దర్శకుడు టి.కృష్ణ అని చెప్పక తప్పదు. సామాజిక సందేశంతో కూడిన ఆయన సినిమాల్లో ఉద్వేగభరితమైన .. ఉద్యమపూరితమైన పాత్రలను విజయశాంతి చేయడం వల్లనే, ఇతర హీరోయిన్లకు భిన్నమైన క్రేజ్ ను ఆమె సంపాదించుకోగలిగారు.

అభినయం పరంగా విజయశాంతిని టి.కృష్ణ తీర్చిదిద్దితే, గ్లామర్ పరంగా ఆమెను మరోస్థాయికి తీసుకెళ్లన దర్శకుడు రాఘవేంద్రరావు అనే చెప్పాలి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయశాంతి చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ తరువాత ఒక కథానాయికగా విజయశాంతి కెరియర్ గ్రాఫ్ పెరగడానికి దాసరి నారాయణరావు .. కోడి రామకృష్ణ .. కోదండరామిరెడ్డి . బి.గోపాల్ ముఖ్య కారకులయ్యారు. వారు మలిచిన కొన్ని పాత్రలు అభిమానుల హృదయాల్లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి.

తెలుగులో చిరంజీవికి .. బాలకృష్ణకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. డాన్సుల్లో చిరంజీవి జోడిగా .. రొమాంటిక్స్ సాంగ్స్ లో బాలకృష్ణ సరసన ప్రేక్షకులను మెప్పించడం కష్టమైన విషయం. అక్కడ కూడా విజయశాంతి సక్సెస్ అయ్యారు. తెలుగులో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది ఈ ఇద్దరి హీరోలతోనే. కాలక్రమంలో రాజకీయాల వైపు వెళ్లిన విజయశాంతి, సినిమాలకి దూరమయ్యారు. విజయశాంతి తరువాత చాలామంది కథనాయికలు వచ్చారు. కానీ విజయశాంతి వంటి నాయిక మాత్రం రాలేదు. అదే ఆమె ప్రత్యేకత .. అందుకే ప్రేక్షకుల హృదయాల్లో ఆమెకి అంతటి ప్రాధాన్యత. ఈ రోజున విజయశాంతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

 (జూన్ 24, విజయశాంతి బర్త్ డే- స్పెషల్)

– పెద్దింటి గోపీకృష్ణ

Must Read : ‘పవర్ ఫుల్’ రోల్స్ కి కేరాఫ్ … బాలకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్