Saturday, January 18, 2025
Homeసినిమా'తంగలాన్' కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

‘తంగలాన్’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

కొంతకాలంగా కోలీవుడ్ కి సంబంధించిన ఒక మూడు సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో కమల్ ‘భారతీయుడు 2’..  సూర్య ‘కంగువ’ .. విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలు కనిపిస్తూ వస్తున్నాయి. ఈ మూడు సినిమాలలో ‘భారతీయుడు 2’ బయటికి వచ్చేసింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిని అందుకోలేక పోయింది. కథాకథనాల పరంగా సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా ఈ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఇక సూర్య .. విక్రమ్ సినిమాలపైనే అభిమానులు దృష్టి పెట్టారు.

‘కంగువ’ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ .. దిశా పటాని ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందుగానే విక్రమ్ ‘తంగలాన్’ థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి, పా. రంజిత్ దర్శకత్వం వహించాడు. రంజిత్ నుంచి గతంలో ‘కబాలి’ .. ‘కాలా’ వంటి సినిమాలు రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా నుంచి ఫస్టు పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి అంతా కూడా అప్ డేట్స్ ఫాలో అవుతూ వస్తున్నారు. విక్రమ్ లుక్ .. కథా నేపథ్యం కోలార్ బంగారు గనుల నేపథ్యంలోనిది కావడం .. ఈ కథ బ్రిటీష్ వారి కాలంలో నడవడం వంటి అంశాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పార్వతి తిరువోతు .. మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. వారి అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్