వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ టి సి) ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దయింది. రెండోరోజు కూడా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అందుకే మొత్తం 90 ఓవర్లకు గాను 64.4 ఓవర్లు మాత్రమే ఆట సాగింది.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మొదటి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జేమ్సన్ బౌలింగ్ లో సౌథీ అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 34 వద్ద ఔటయ్యారు. ఆ వెంటనే నీల్ వాగ్నర్ విసిరిన చక్కటి బంతికి గిల్ కూడా వెనుదిరిగాడు. గిల్ 28 పరుగులు చేశాడు. ఆ తర్వాతా పుజారా-కోహ్లి జోడీ వికెట్ పడకుండా ఆచి తూచి ఆడారు. జట్టు స్కోరు 88 వద్ద బౌల్ట్ పుజారాను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రెహానే కెప్టెన్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండోరోజు మూడో సెషన్ ఆటకు ముందు రెండుసార్లు అంతరాయం కలిగింది. తరువాత ఆట మొదలు పెట్టినా మరోసారి వెలుతురు కారణంగా 64.4 ఓవర్ల వద్ద రెండోరోజు ఆట నిలిపివేస్తూ అంపైర్లు, రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. కోహ్లి-రెహనే జోజీ నాలుగో వికెట్ కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లి 44, రేహానే 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.