Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ధోనీ రాకతో నూతనోత్తేజం: కోహ్లీ

ధోనీ రాకతో నూతనోత్తేజం: కోహ్లీ

టీమిండియా టి-20 జట్టుకు మెంటార్ గా ధోనీ రాకతో నూతనోత్సాహం, ఉత్తేజం నెలకొన్నాయని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.  తమకు ఎప్పటినుంచో ధోనీ ఒక మెంటార్ గా వ్యవహరిస్తూనే ఉన్నారని, కానీ అధికారిక హోదాలో తమతో కలిసి పనిచేయడం ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యంలో ఐసీసీ టి-20 వరల్డ్ కప్ రేపటి నుంచి ప్రారంభమవుతోంది.  మొదటి రోజున రెండు మ్యాచ్ లు ఒమన్- పీఎన్జీ; బంగ్లాదేశ్-స్కాట్లాండ్ జట్ల మధ్య జరగనున్నాయి. ఇండియా తన మొదటి మ్యాచ్ ను దాయాది పాకిస్తాన్ తో అక్టోబర్ 24న తలపడనుంది.

అయితే ఈ సిరీస్ కు గాను ఇండియా జట్టుకు మెంటార్ గా మహేంద్ర సింగ్ ధోనీని  బిసిసిఐ నియమించింది. క్రికెట్ లో, ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ లో ధోనీకున్న అపార అనుభవాన్ని, వ్యూహాలను జట్టుకు వినియోగించుకోవడంలో భాగంగా ఈ పదవిని సృష్టించి మరీ నియమించారు. నిన్ననే దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్-2021 టైటిల్ కూడా ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెల్చుకుంది.

క్రికెట్ లో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతోన్న ఎంతోమంది యువ ఆటగాళ్లకు ధోనీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయని, ఆటలో తమ బలాలు, బలహీనతలు తెలియజెప్పి వారిని మరింత రాటుదేలేలా తీర్చి దిద్దడంలో ధోనీ అపార అనుభవం  కొత్త ఆటగాళ్ళకు స్ఫూర్తి ఇస్తుందని కోహ్లీ పేర్కొన్నాడు. ధోనీ రాకతో జట్టు నైతిక స్థైర్యం మరింత పెరుగుతుందని వెల్లడించాడు. గత టి-20 టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయామని, ఈసారి ఖచ్చితంగా సత్తా చాటుతామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్