మొదటి నుంచి కూడా విష్వక్సేన్ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకునే దిశగానే ముందుకు వెళ్లాడు. ఆ తరువాత యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించవలసిన అవసరం ఉందని గ్రహించి, ఆ తరహా కథలను కూడా చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ సారి కాస్త మాస్ పాళ్లు ఉన్న కథనే ఎంచుకుని, ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి ఆయనే దర్శకనిర్మాత కావడం విశేషం.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా వచ్చిన ఎన్టీఆర్, ఇకపై డైరెక్షన్ జోలికి వెళ్లొద్దని విష్వక్ కి చెప్పాడు. కొత్త దర్శకులు ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తున్నారనీ, వారిని ప్రోత్సహించమని అన్నాడు. అందుకు విష్వక్ కూడా వెంటనే ఆ స్టేజ్ పై తన అంగీకారాన్ని తెలియజేశాడు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన మాత్రమే కాదు, హీరోగా మాత్రమే కెరియర్ పై పూర్తి దృష్టి పెట్టమని విష్వక్ కి చెప్పడం ఎన్టీఆర్ ముఖ్య ఉద్దేశం.
టాలీవుడ్ లో కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారుతుంటే, మరికొందరు హీరోలు తమ పారితోషికాన్ని పెట్టుబడిగా చూపిస్తూ, నిర్మాణ భాగస్వాములవుతున్నారు. ఇంతవరకూ ఓకే .. కానీ విష్వక్ వీటికి తోడు దర్శకత్వ బాధ్యతను కూడా భుజాలపై వేసుకుంటున్నాడు. తలకి మించిన పనులు పెట్టుకుంటే, నటనపై నుంచి దృష్టి పూర్తిగా పక్కకి పోతుంది. నానా రకాల సమస్యలతో కెమెరా ముందుకు వెళ్లడం కరెక్టు కాదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ తన మనసులోని మాట చెప్పాడు. మరి విష్వక్ పాటిస్తాడా .. లేదా అనేది చూడాలి.