Venkatesh: ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లలో టాలెంట్ తో దూసుకుపోతున్నవారిలో వివేక్ ఆత్రేయ ఒకరుగా కనిపిస్తున్నాడు. ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను రెడీ చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన ఆయన, ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. పూర్తి వినోదభరితమైన కథలను తెరకెక్కించే సమర్థత కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రమైన ‘అంటే .. సుందరానికీ’ జూన్ 10వ తేదీన విడుదలకి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ .. ” ఈ సినిమా కథ ఫస్టాఫ్ వినగానే .. ఈ సినిమాను చేస్తున్నామని నానిగారు చెప్పడం విశేషం. హీరోయిన్ గా నజ్రియాను అనుకున్న తరువాత, ఆమెకి తమిళంలో కథను చెప్పాను. కొంతసేపు కథ వినగానే ఆమెలో కాస్త ఆసక్తి .. ఉత్సాహం కనిపించాయి. ఆ తరువాత ఆమె ఎంతమాత్రం నాన్చకుండా ఈ సినిమా చేస్తున్నట్టుగా చెప్పారు. నజ్రియా ఎంత గ్లామరస్ గా కనిపిస్తుందో .. ఎంత బాగా చేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తప్పకుండా ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుంది.
ఇక నా అభిమాన నటుడు వెంకటేశ్ గారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులు ఆయనను ఎలా చూడాలనుకుంటారనేది నాకు బాగా తెలుసు. అందువలన ఆయనతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. నా దగ్గర మూడు .. నాలుగు కథలు ఉన్నాయి. ఆ కథలపై కసరత్తు జరిగిన తరువాత .. ఆయనకి తగిన కథను పట్టుకుని వెళతాను. కాస్త ఆలస్యమైనా ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.